రెండ్రోజులుగా బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మాల్దీవులను సందర్శించడం మానేయాలని పలువురు సెలబ్రిటీలు పిలుపునిస్తున్నారు. మాల్దీవుల బదులు మన దేశంలోని అందమైన బీచ్ లను ఎంచుకోవాలని కోరుతున్నారు. మరోవైపు భారత్ నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతుండడంతో మాల్దీవుల ప్రభుత్వం అప్రమత్తమైంది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత్ తో పాటు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం తొలగించింది. అసలు మాల్దీవులకు, భారత్ కు మధ్య వివాదం ఎక్కడ మొదలైంది..? మాల్దీవులను బాయ్ కాట్ చేయాలని భారతీయులు ఎందుకు పిలుపునిస్తున్నారు..? మాల్దీవుల ప్రభుత్వం ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టింది..? లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలంటే ఓ వారం వెనక్కు వెళ్లాలి.
మోదీ ఏం చేశారు?
గతవారం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో పర్యటించారు. భారత్ లో ఒక కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్. అద్భుతమైన బీచ్ లకు లక్షద్వీప్ పెట్టింది పేరు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు లక్షద్వీప్ లో పర్యటిస్తుంటారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా గతవారం లక్షద్వీప్ లో పర్యటించి అక్కడి బీచ్ లను ఆస్వాదించారు. వాటర్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు. అంతేకాక.. సాహసాలు కోరుకునేవారు లక్షద్వీప్ లో పర్యటించాలంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. లక్షద్వీప్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనేది ప్రధాని మోదీ ఉద్దేశం. అందుకు అనుగుణంగా ఆయన బీచ్ లో సేదతీరుతున్న ఫోటోలను, స్నార్కెలింగ్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు లక్షద్వీప్ ఎక్కడుందోనని వెతకడం మొదలు పెట్టారు. లక్షద్వీప్ లో పర్యటించేందుకు ఆసక్తి కనబరిచారు. మాల్దీవులను, లక్షద్వీప్ బీచ్ లను పోల్చుతూ చాలా మంది పోస్టులు చేశారు.
మాల్దీవ్స్ నేతల అక్కసు ఏంటి?
అయితే లక్షద్వీప్ క్రేజ్ పెరిగితే తమ పర్యాటకం ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడిన మాల్దీవుల ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ అక్కసు వెళ్లగక్కారు. లక్షద్వీప్ ను, భారత్ ను ఎద్దేవా చేస్తూ ఎక్స్ లో ట్వీట్లు చేశారు. అంతేకాక ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల మంత్రి మరియం షియునా మోదీని జోకర్ గా, తోలుబొమ్మగా సంభోదిస్తూ ట్వీట్లు చేశారు. ఆవుపేడతో చేసిన లడ్డూకు, భారత్ కు తేడా లేదన్నారు. మరో ఇద్దరు మంత్రులు అబ్దుల్లా మజూం మజీద్, మల్షా షరీఫ్ కూడా తమ అక్కసు వెళ్లగక్కారు. మాతో అసలు లక్షద్వీప్ కు పోలికేంటని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. భారత్ లో హోటల్ రూమ్స్ ఎప్పుడూ అసహ్యంగా కంపు కొడుతుంటాయన్నారు. భారత్ ను అపరిశుభ్ర దేశంగా అభివర్ణించారు. అసలు మా దేశంలో లక్షద్వీప్ కు పోలికేంటని వ్యంగ్యంగా మాట్లాడారు.
మాల్దీవ్స్ పప్పులో కాలేసిందా?
మాల్దీవుల మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించిన తీరుపై భారత్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మాల్దీవుల్లోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అధికారులు రాయబార కార్యాలయం ముందు నిరసన తెలిపారు. దీంతో కొంతమంది తమ పోస్టులను తొలగించారు. మరోవైపు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ భారత్ తో వైరం మంచిది కాదని సూచించారు. నోరుజారిన వారిపై చర్యలు తీసుకోవాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్ మనకెంతో కీలక దేశమని, ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాల్లో భారత్ అందిస్తున్న సహకారాన్ని మరిచిపోకూడదని సూచించారు. మాల్దీవుల అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అలాంటి దేశాధినేతపై నీచమైన భాష ఉపయోగించడం సరికాదని స్పష్టం చేశారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
మాల్దీవుల తీరుపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. ఢిల్లీలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్ కు సమన్లు జారీ చేసింది. ఆదివారం ఆయన హోంశాఖ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు మాల్దీవుల తీరుపై మండిపడుతున్నారు. బాయ్ కాట్ మాల్దీవ్స్ అని పిలుపునిస్తున్నారు. కొంతమంది తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. భారతీయ సెలబ్రిటీలు పలువురు మన దేశ పర్యటకాన్ని ప్రోత్సహించేలా మన దేశీయ బీచ్ లను ఎంచుకోవాలని పర్యాటకులకు సూచించారు. సచిన్ టెండూల్కర్, వెంకటేశ్ ప్రసాద్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహాం, శ్రద్ధా కపూర్ తదితరులు మాల్దీవుల తీరును తీవ్రంగా ఖండించారు. మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపిస్తున్న భారత్ పై అలా మాట్లాడడం సరికాదని అక్షయ్ కుమార్ మండిపడ్డారు. గతంలో తాను ఎన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించానని.. అయితే ఇకపై ఆత్మగౌరవమే ఫస్ట్ అని స్పష్టం చేశారు. మన దీవుల్లో, బీచ్ ల్లో పర్యటిస్తూ పర్యాటకానికి అండగా నిలుద్దాం అని పిలుపునిచ్చారు. “ఇంతటి అందమైన బీచ్ లు మనదేశంలోనే ఉండడం గర్వకారణం.. ప్రధాని మోదీని లక్షద్వీప్ లోని అందమైన, పరిశుభ్రమైన బీచ్ ల్లో చూడడం ఆనందంగా ఉంది” అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. “అతిథిదేవోభవ సందేశంతో భారత్ ఇచ్చే ఆతిథ్యం, విస్తారమైన సముద్ర తీరాలను చూడాలంటే లక్షద్వీప్ వెళ్లాల్సిందే” అని జాన్ అబ్రహాం బీచ్ ఫోటోలను షేర్ చేశారు. త్వరలోనే తాను లక్షద్వీప్ సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు శ్రద్ధా కపూర్ వెల్లడించారు. ఇటీవలి తన లక్షద్వీప్ పర్యటన ఫోటోలను సచిన్ టెండూల్కర్ షేర్ చేశారు. మాల్దీవులకు ఫ్లయిట్ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు ఈజ్ మై ట్రిప్ సంస్థ వెల్లడించింది.
మాల్దీవ్స్ ఎందుకు లెంపలేసుకుంది?
భారత్ తో పాటు సోషల్ మీడియాలో తమపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గ్రహించిన మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అంతేకాక.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను తొలగించినట్లు వెల్లడించింది. వాళ్ల కామెంట్స్ వ్యక్తిగతమని, ప్రభుత్వానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. భావప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలి తప్ప విద్వేషాలను, ప్రతికూల ప్రభావాలను కలిగించేలా ఉండొద్దని కోరింది. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సత్సంబంధాలను దెబ్బ తీయొద్దని సూచించింది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడబోమని ప్రకటించింది.
మాల్దీవులు ఎందుకు ఇంతగా భయపడుతోంది..?
భారత్ కు నైరుతి దిశలో హిందూ మహా సముద్రంలో ఏర్పడిన ద్వీపాల సముదాయమే మాల్దీవులు. ఇక్కడ అందమైన బీచ్ లున్నాయి. అందుకే ఇక్కడ పర్యాటకరంగం బాగా అభివృద్ధి చెందింది. సుమారు 20 నుంచి 25 శాతం ఆదాయం పర్యాటకరంగం నుంచే వస్తుంది. ఈ బీచ్ లను ఏటా లక్షలాది మంది సందర్శిస్తుంటారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే. 2023లో సుమారు 2 లక్షల మంది, 2022లో రెండున్నర లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. అయితే తాజాగా మాల్దీవుల నేతలు చేసిన కామెంట్స్ తో ఈ ఏడాది పర్యాటకుల సందర్శన భారీగా తగ్గిపోతుందని మాల్దీవులు అంచనాకు వచ్చింది. అందుకే తమ మంత్రులపై వేటు వేసింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. లక్షద్వీప్ లో మోదీ పర్యటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ బీచ్ లు వెలుగులోకి వచ్చాయి. ఇంతటి అందమైన బీచ్ లున్న లక్షద్వీప్ ను సందర్శించాలనుకుంటున్నట్టు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రయాటకులు ట్వీట్ చేస్తున్నారు. దీంతో మాల్దీవులపై దీని ప్రభావం భారీగా పడనుంది.
భారత్ పై మాల్దీవుల ఆలోచన ఎప్పుడు మారింది..?
వాస్తవానికి మాల్దీవుల ప్రభుత్వం గతేడాది వరకూ భారత్ తో ఎంతో సఖ్యతగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇండియా ఫస్ట్ నినాదంతో ఇబ్రహీం మహ్మద్ సోలీ ప్రభుత్వం వ్యవహరించింది. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో సోలీ ప్రభుత్వం ఓటమి పాలైంది. మహమ్మద్ మయిజ్జూ నేతృత్వంలో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈయన భారత్ వ్యతిరేకిగా ముద్రపడ్డారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇండియా అవుట్ నినాదం గట్టిగా వినిపించారు. అధికారంలోకి రాగానే మాల్దీవుల్లోని సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలంటూ భారత్ ను కోరారు. అంతేకాక గత ప్రభుత్వం భారత్ తో ఏర్పాటు చేసుకున్న పలు ఒప్పందాలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మయిజ్జూ చైనా అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు. మాల్దీవుల నుంచి భారత్ ను పూర్తిగా తరిమేసి చైనాను తెచ్చుకోవాలనేది మయిజ్జూ ఆలోచన.
భారత్ కు చెక్ పెట్టేందుకు మాల్దీవుల్లో ఎలాగైనా పాగా వేయాలని చైనా కూడా ఆలోచిస్తోంది. అందుకే మయిజ్జూను బుట్టలో వేసుకుని పావులు కదుపుతోంది. తాజా వివాదం తెరపైకి రాకపోయి ఉంటే మయిజ్జూ భారత్ పై దూకుడుగా వ్యవహరించి చైనాకు రెడ్ కార్పెట్ పరిచేవారు. కానీ ఇప్పుడు మయిజ్జూ స్పీడ్ కు కాస్త బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో మాల్దీవుల అభివృద్ధిలో భారత్ పాత్రను తోసిపారేయలేం. తాగునీరు మొదలు పారిశ్రామిక, పర్యాటక రంగం వరకూ మాల్దీవులకు భారత్ ఎంతో సాయం చేస్తోంది. పాలకులకు భారత్ తో స్నేహం నచ్చకపోయినా ప్రజలు భారత్ తో వైరం మంచిది కాదనే కోరుకుంటున్నారు. మరి తాజా పరిణామాలతోనైనా మయిజ్జూ ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా.. లేదా.. అనేది వేచి చూడాలి.