పార్టీలకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సపోర్టు ఉంటే చాలూ చక్రం తిప్పొచ్చు… విజయపథంలో ముందుకు పోవచ్చనుకుంటారందరూ. అయితే ఇప్పటివరకు సలహాదారుడిగా ఉన్న పీకే… తాను డీల్ చేసుకున్న పార్టీల గెలుపు కోసం వ్యూహాలకు పదును పెట్టారు. భారత రాజకీయాల్లో రాజకీయ సలహాదారుడిగా తనకు సాటిలేరన్న స్థాయికి ఎదిగారు పీకే. అయితే, ఇంతకాలం వెనుకుండి చక్రం తిప్పిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరనున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. పార్టీలోకి పీకేను తీసుకోవాలనే నిర్ణయం దాదాపు ఫైనల్ అయింది. కాంగ్రెస్‌లో పీకే చేరికపై పెద్దఎత్తున సీనియర్ నాయకుల కమిటీ మల్లగుల్లాలు పట్టింది. ఫైనల్‌గా పీకే చేరికకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.
Read Also: Drugs: కొకైన్ కడుపులో దాచిన కేటుగాడు.. ఆపరేషన్ చేసి స్వాధీనం
అయితే కాంగ్రెస్‌లో సీనియర్లందరూ ఒప్పుకున్నాక… పీకే ఒక్కసారిగా వెనకడుగు వేశారు. అయితే సలహాదారుడిగా పార్టీల్లో చక్రం తిప్పిన పీకే… తాను పార్టీ నాయకుడిగా మారితే.. ఎంతమేరకు సక్సెస్ ఉంటుందో ఆలస్యంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కింగ్ మేకర్‌గా ఉంటే పార్టీ సక్సెస్ అయితే క్రెడిట్ దక్కుతుంది. ఫెయిల్ అయితే లైట్ తీసుకోవచ్చు. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీకి సర్వీస్ ఇయ్యొచ్చు. అదే నాయకుడిగా తాను చెప్పిన టార్గెట్‌ను పూర్తి చేయకపోతే… ఆ ఫెయిల్యూర్‌ను ఫేస్ చేయటం అంత ఈజీ కాదని పీకే భావించినట్లుగా చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీకి సలహాదారుడిగా ఉంటే అధ్యక్షుడి ద్వారా తన వ్యూహాలను అమలు చేయొచ్చు పీకే. కానీ పార్టీలో ఏ స్థానంలో ఉన్నా… ఆ ఎఫెక్ట్ మరోలా ఉంటుంది. పార్టీ నాయకుడిగా ఆయన ఇచ్చే సలహాలు, సూచనలను అందరూ ఫాలో కాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అసలే ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏకంగా పార్టీ అధ్యక్షులపైనే ఆరోపణలు చేసే నాయకులెందరో కాంగ్రెస్‌లో ఉన్నారు. అలాంటి నాయకులతో ప్రశాంత్ కిషోర్ మనగలరా..? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో అన్నీ తట్టుకుని 2024 దాకా అందులో ఉంటే… ఆయన అనుకున్న లక్ష్యం అందుకుంటారా? అదే జరగకపోతే.. అప్పుడు అందరూ ఎవరిని నిందిస్తారు? వారందరికీ ప్రశాంత్ కిషోర్‌ను టార్గెట్ అవుతారా? ఇలా అనేక అంశాలపై ఆలోచించాకే.. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరికపై వెనక్కి తగ్గారని సమాచారం. అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాక.. కింగ్ అవటంకన్నా, కింగ్ మేకర్‌గా ఉండాలనుకుని… రాజకీయ పార్టీలకు సలహాదారుడిగానే ఫిక్సయ్యారట ప్రశాంత్ కిషోర్. మొత్తంమీద, ఈ వారం రోజులుగా దేశ రాజకీయ వార్తల్లో పీకే ఫుల్ పాపులర్ అయ్యారు.
