NTV Telugu Site icon

WHO Worry: నిబంధనలు గాలికి.. నిర్లక్ష్యం ఖరీదెంత?

ఒక్క చిన్న వైరస్.. వందలాది దేశాలను వణికించింది. ఒకటి కాదు రెండేళ్ళకు పైనే అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాదిమంది ఆ మహమ్మారికి బలయిపోయారు. కరోనా వైరస్ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగిరావడంతో అనేక దేశాలు నిబంధనలు వదిలేశాయి. మనదేశంలో 25వేలకు లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. నెలక్రితం ఈ సంఖ్య రెండు లక్షలకు పైమాటే. కరోనా తగ్గిందని జనం బయట యథావిధిగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అంతేకాదు, కరోనా పరీక్షలను తగ్గించేశాయి. అయితే, కరోనా విషయంలో అలసత్వం పనికిరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు పరీక్షలు చాలా కీలకమని, వాటిని తక్షణం కొనసాగించాలని కోరింది. కరోనా మన జీవితంలో భాగంగానే వుంటుందని, వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేయడం ఒక్కసారిగా పడిపోయాయి. ఒక వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించిందీ, లేనిదీ తెలుసుకునేందుకు కానీ, వైద్యం అందించాలన్నా పరీక్షలు తప్పనిసరి. పరీక్షల విషయంలో మనం చేసే నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు అంటున్నారు నిపుణులు. ఒమిక్రాన్ వేరియంటే చివరిది కాదని, మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ కనుక వెలుగు చూస్తే అది మరింత శక్తమంతంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో జీరో కరోనా కేసులు వున్నాయని డబ్ల్యుహెచ్ వో జాబితా విడుదల చేసింది. దక్షిణ పసిఫిక్ మహాపముద్రంలోని టువాలు, టోకిలౌ, సెయింట్ హెలెనా, పిట్ కెయిర్స్ ఐల్యాండ్స్, నియూ, నౌరు, మైక్రోనేషియా, వనౌటు, మార్షల్ ఐల్యాండ్స్, కూక్ ఐల్యాండ్స్ లో కేసులు లేవు. కానీ కూక్ ఐల్యాండ్స్ లో తొలి కేసు నమోదైంది. ఇతర దేశాల నుంచి నిత్యావసరాలు అక్కడకు వెళ్లడంతో కరోనా వ్యాపించిందని చెబుతున్నారు. వీటితో పాటు నార్త్ కొరియా, తుర్కమెనిస్తాన్‌లో సున్నా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు దేశాలు తమ సరిహద్దుల్ని మూసేయడంతో అక్కడి కరోనా పరిస్థితి ఎవరికీ అంతుచిక్కడం లేదంటున్నారు.