NTV Telugu Site icon

Maoist Leader Chalapati: మావోయిస్ట్ అగ్రనేత చలపతి హతం.. రూ. కోటి రివార్డ్.. ఎవరు ఇతను..?

Chalapati

Chalapati

Maoist Leader Chalapati: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం రాత్రి ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి మరణించారు. ఇతడి అసలు పేరు జయరాం రెడ్డి, రామచంద్రారెడ్డి, అప్పారావు, రాము అనే మారుపేర్లు కలిగి ఉన్నారు. ఇతడిపై ప్రభుత్వం రూ. 1 కోటి రివార్డు ప్రకటించింది. అనేక దాడుల్లో ఇతడి ప్రమేయం ఉంది. సల్వాజుడుం నేత మహేంద్ర కర్మని హతమార్చిన ఆపరేషన్‌లో చలపతి ప్రమేయం కీలకంగా ఉంది.

ప్రస్తుతం మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మాకి చలపతి గురువుగా భావిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకి అత్యంత సన్నిహితుడు. చలపతి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2018 లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యాకాండలో చలపతి కీలకంగా ఉన్నారు.

Read Also: Donald Trump : ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే రూ.48 వేల కోట్ల నష్టం.. ఎక్కడంటే ?

జయరాం రెడ్డి అలియాస్ చలపతి ఎవరు..?

60 ఏళ్ల చలపతి ఆంధ్రప్రదేశ్ చిత్తూర్‌లోని మదనపల్లెకి చెందిన వారు. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అతని విద్యా నేపథ్యం తక్కువగా ఉన్నప్పటికీ, మావోయిస్టు అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీ సభ్యుడిగా చేరాడు. రూ. 1 కోటి రివార్డ్ ప్రకటించిందంటే చలపతి ప్రభుత్వానికి ఎంత ప్రాముఖ్యంగా మారాడో తెలుస్తోంది. చలపతికి బస్తర్ అడవుల గురించి అంతా తెలుసు. 8-10 మంది వ్యక్తగత గార్డులతో కూడిన భద్రతా సిబ్బంది చలపతిని ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తుంది.

దాడులకు వ్యూహాలు రూపొందించడంలో చలపతి దిట్ట. అబుజ్‌మడ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎన్‌కౌంటర్లు పెరిగిన నేపథ్యం ఇటీవల చలపతి ఆయన స్థావరాన్ని గరియాబంద్-ఒడిశా సరిహద్దుకు మార్చారు.

ఎన్‌కౌంటర్:

చలపతి సహచరుల్ని ఇంకా పోలీసులు గుర్తించలేదు. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్ , సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ కోబ్రా కమాండోలు, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌తో కూడిన దళాలు ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కులారి ఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆపరేషన్ నిర్వహించాయి. కొంతమంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌ని ‘‘అతిపెద్ద విజయం’’గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు.