Pratap Sarangi: అమిత్ షా ‘‘అంబేద్కర్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరనసలు ఉద్రిక్తంగా మారాయి. పార్లమెంట్ ఆవరణ ముందు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని నెట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతాప్ సారంగి మెట్లపై పడటంతో ఆయన తనకు గాయాలయ్యాయి.
ప్రతాప్ చంద్ర సారంగి ఎవరు..?
ప్రతాప్ చంద్ర సారంగి ఒడిశాకు చెందిన ప్రముఖ బీజేపీ నేత. బాలాసోర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బాలాసోర్‌లోని గోపీనాథ్‌పూర్ గ్రామంలో జనవరి 4, 1955లో జన్మించారు. 1975లో ఉత్కల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫకీర్ మోహన్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. సారంగి రాజకీయ ప్రయాణం ఆర్ఎస్ఎస్ వాలంటీర్‌గా మొదలైంది. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ), బజరంగ్ దళ్‌లో పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు ఒడిశాలోని నీలగిరి అసెంబ్లీ నుంచి రాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు.
2019లో ఎంపీగా పోటీచేసి బీజేడీ ఎంపీ రవీంద్రకుమార్ జెనాపై 12 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో సారంగి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
1999లో ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్, అతడి ఇద్దరు కుమారులను హత్య చేయడంతో సారంగి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. 2002లో ఒడిశా రాష్ట్ర అసెంబ్లీపై దాడి జరిగిన తర్వాత అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో సారంగిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సారంగి జబరంగ్ దళ్‌కు చీఫ్‌గా ఉన్నారు. సంస్థతో సంబంధం ఉన్న గుంపు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేరానికి గానూ సారంగి, మరో 10 మందికి మొదటి దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు లేవంటూ ఒడిశా హైకోర్టు తర్వాత వారిని నిర్దోషులుగా ప్రకటించింది.