Daya Nayak: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై ఈ రోజు తెల్లవారుజామున దుండగుడు దాడి చేసిన ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. సైఫ్ ఒంటిపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. అయితే, ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read Also: Prashant kishor: 14 రోజుల తర్వాత ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష విరమణ
ఎవరు ఈ దయా నాయక్..?
1990లలో 80 మందికి పైగా ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్లను కాల్చి చంపిన దయానాయక్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. కర్ణాటక ఉడిపిలో కొంకణి మాట్లాడే కుటుంబంలో బద్దా, రాధానాయక్ దంపతులకు దయా నాయక్ జన్మించారు. స్వగ్రామంలోనే 7వ తరగతి వరకు కన్నడ మీడియంలో చదువుకున్నారు. ఆ తర్వాత తన కుటుంబానికి సాయం చేయడానికి ఉద్యోగం కోసం 1979లో ముంబైకి వచ్చారు.
మొదటగా ఒక హోటల్‌లో పనికి చేరారు. అక్కడే పనిచేస్తూ ముంబైలోని గోరేగావ్‌లోని మున్సిపల్ స్కూల్ నుంచి 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత అంధేరిలోని సీఈఎస్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ తర్వాత ప్లంబర్ అప్రైంటిస్‌గా పనిచేస్తున్న క్రమంలో నార్కోటిక్స్ విభాగానికి చెందిన కొంతమంది పోలీసు అధికారులను కలిసిన సమయంలో, పోలీస్ అధికారి కావాలనే కోరిక మనసు బలంగా చేరింది.
1995లో ముంబైకి వచ్చి 15 ఏళ్లు అయిన తర్వాత పోలీస్ అకాడమీ నుంచి పట్టభద్రుడైనాడు. మొదటి పోస్టింగ్ జుహూలో పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా చేరారు. ఆ సమయంలోనే ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా ఎక్కువగా ఉంది. 1996 డిసెంబర్‌లో గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ గ్యాంగ్‌కి చెందిన ఇద్దరిని నాయక్ కాల్చి చంపారు. అప్పుడే దయా నాయక్ పేరు మార్మోగింది.
ఇంత పేరు సంపాదించినప్పటికీ, అతడిపై వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి. 2004లో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (MCOCA) కోర్టు నాయక్ అసమాన సంపదను దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక బ్యూరో (ACB)ని ఆదేశించింది. ఈ కేసులో నాయక్‌కి చెందిన ఇళ్లు, ఆస్తులపై దాడులు జరిగాయి. బెంగళూరులోని రెండు ప్రదేశాలతో సహా ఆరు ప్రదేశాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో నాయక్ రెండు లగ్జరీ బస్సులను కలిగి ఉన్నట్లు తేలింది. నాయక్‌ని ఏసీబీ అరెస్ట్ చేసింది. 2012లో తిరిగి అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) కంట్రోల్ రూమ్‌గా ఆయన తిరిగి నియమితులయ్యారు.