Site icon NTV Telugu

Hardeep Nijjar Killing: “నిజ్జర్ హత్యపై ఆధారాలు ఏవి..?” కెనడాను ప్రశ్నించిన న్యూజిలాండ్..

Hardeep Nijjar Killing

Hardeep Nijjar Killing

Hardeep Nijjar Killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదానికి కారమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం మరింత ఎక్కువైంది. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలు చేసిన కెనడాకు మిత్ర పక్షం న్యూజిలాండ్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది.

న్యూజిలాండ్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. కెనడా ఆరోపణలపై ధృవీకరించే ఎలాంటి ఆధారాలు పంచుకోలేదని చెప్పారు. గతంలో ‘ఫైవ్ ఐస్’ (కెనడా, అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలకు తాము సమాచారం అందించామని కెనడా పేర్కొంది. తాజాగా కెనడా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని న్యూజిలాండ్ ఉపప్రధాని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌లో సెంటర్-రైట్ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కెనడా ఆరోపణలపై ఫైవ్ ఐస్ భాగస్వామ్య దేశం ప్రశ్నించడం ఇదే మొదటిసారి. భారత పర్యటనకు వచ్చిన పీటర్స్ విదేశాంగ మంత్రి జైశంకర్‌ని కలిశారు. గుజరాత్‌ని సందర్శించారు.

Read Also: Uddhav Thackeray: “బీజేపీ అవమానిస్తే మాతో చేరండి, మంత్రిని చేస్తాం”.. నితిన్ గడ్కరీకి ఠాక్రే పిలుపు..

హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరసత్వం కలిగిన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. కెనడా వేదికగా భారత వ్యతిరేఖ, ఖలిస్తాన్ వేర్పాటువాదానికి పాల్పడుతున్నాడు. ఇతను ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. భారత ప్రభుత్వం ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే, గతేడాది కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా నుంచి బయటకు వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య వెనక భారత్ ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే, కెనడావి అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా ఇండియా ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది.

Exit mobile version