భారత్‌లో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు అంటే 8 ఏళ్ల కాలంలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు బ్రూక్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు వివరాలను సేకరించారు. దేశంలో అక్షరాస్యత రేటు పెరగడం, బరువు మోయడానికి గాడిదలను వాడే ఇటుక పరిశ్రమలలో యంత్రాలు అందుబాటులోకి రావడం, రవాణాకు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం వంటి కారణాల వల్ల దేశంలో గాడిదలు తగ్గిపోయినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
Read Also: పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన మాజీ సీఎం
గాడిదలను అక్రమంగా రవాణా చేయడం, వాటి తోలు, మాంసంను అక్రమ మార్గాల్లో దేశం దాటించడం కూడా గాడిదలు తగ్గడానికి కారణాలుగా బ్రూక్ ఇండియా సర్వే స్పష్టం చేసింది. మందుల తయారీ కోసం గాడిదల చర్మం ఎక్కువగా చైనాకు రవాణా అవుతోంది. గాడిదల చర్మంతో తయారు చేసే ఎజియావో అనే ఔషధాన్ని పలురకాల రుగ్మతలకు చికిత్సలో వాడుతున్నారు. దీంతో చైనాకు సంబంధించిన పలువురు ప్రతినిధులు భారత్‌కు వచ్చి గాడిదల చర్మం అడుగుతున్నారని మహారాష్ట్రలోని ఓ వ్యాపారి వెల్లడించడం తాజా పరిణామాలకు అద్దం పడుతోంది.
