Site icon NTV Telugu

Hindu Rate Of Growth: ‘‘హిందూ వృద్ధిరేటు’’పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు.. అసలేంటి ఇది..

Pm Modi

Pm Modi

Hindu Rate Of Growth: భారతదేశ ఆర్థిక మందగమనాన్ని హిందూ విశ్వాసంతో ముడిపెట్టే ప్రయత్నాలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఖండించారు. ‘‘హిందూ వృద్ధిరేటు’’ను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆయన అన్నారు. 23వ హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మోడీ మాట్లాడుతూ.. దశాబ్ధాల పాటు భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’గా పిలుస్తూ, హిందూ జీవన విధానాన్ని కించపరిచేందుకు ఈ పదాన్ని ఉపయోగించారని అన్నారు.

ప్రపంచంలో పెరుగుతున్న భారత స్థాయి గురించి మాట్లాడుతూ.. ప్రపంచం విచ్ఛిన్నం, అనిశ్చితి ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ వారధిగా మారుతోందని అన్నారు. ప్రపంచంలో మందగమనంలో ఉన్నప్పటికీ, భారత్ వృద్ధి కథలను రాస్తుందని అన్నారు. ప్రపంచంలోనే నమ్మకం తగ్గినప్పుడు, భారత్ నమ్మకానికి స్థంభంలా నిలుస్తుందని అన్నారు.

అసలు ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అంటే ఏమిటి.?

‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనే పదాన్ని ఆర్థిక శాస్త్రవేత్త రాజ్‌కృష్ణ 1978లో ఉపయోగించారు. స్వాతంత్య్రం తర్వాత 1950 నుంచి 1980ల వరకు భారత జీడీపీ వృద్ధిరేటు సుమారు 3.5%–4% మాత్రమే ఉండేది. అయితే, ఈ నెమ్మదైన వృద్ధిరేటనున సూచించడానికి ఈ పదాన్ని వాడారు. ‘‘తక్కువతో సంతృప్తి పడే హిందూ జీవనశైలి’’ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోలేదు అనే భావనను తీసుకువచ్చారు.

ఇప్పుడు ఈ పదమే వివాదానికి కారణమైంది. ఆర్థిక వృద్ధి నెమ్మదికి హిందువుల సంస్కృతి కారణం కాదని, నిజానికి దీనికి కారణం ప్రభుత్వం విధానాలు, భారీగా ప్రభుత్వ నియంత్రణ, నిర్బంధ నియామాలు కారణమని ఆర్థికవేత్తలు ఎత్తిచూపారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిని ఒక మతానికికి ఆపాదించడం అన్యాయమని చెప్పారు. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించిన తర్వాత వృద్ధి పుంజుకుంది. అప్పటి నుంచి ఈ ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనేది పాత పదంగా మారింది. అయితే, 2023లో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ భారతదేశం ప్రమాదకరంగా ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’కు దగ్గరగా ఉందని అన్నారు. ఈయన వ్యాఖ్యలు అనేక మంది ఆర్థిక వేత్తల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ఎస్‌బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ మాట్లాడుతూ.. దీనిని తప్పుడు అంచనాగా, పక్షపాతపూరిత వ్యాఖ్యగా విమర్శించారు.

Exit mobile version