రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు? అనే ఉత్కంఠకు విపక్షాలతో పాటు అధికార పక్షం తెరదించింది.. ఇవాళ ఢిల్లీలో సమావేశమైన విపక్షాలు సుదీర్ఘ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దించగా.. ఇక, అనూహ్యంగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది బీజేపీ అధిష్టానం.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని పెడితే బాగుంటుంది? అనే విషయంపై చర్చించిన తర్వాత.. 64 ఏళ్ల ఒడిశా ట్రైబల్ లీడర్‌ను పోటీకి పెట్టాలని నిర్ణయానికి వచ్చారు.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము అని ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అయితే, ఆమెను బరిలోకి దించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీఏ, యూపీఏ కూటములతో చర్చించి, అందరి సర్వ సమ్మతితో ఒక రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రయత్నం చేశామని.. కానీ, సమ్మతి సాధ్యం కాలేదన్నారు జేపీ నడ్డా.. యూపీఏ కూటమి ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిందని గుర్తుచేసిన ఆయన.. దీంతో మేం కూడా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలతో చర్చించి అభ్యర్థిని ఎంపిక చేశామని వెల్లడించారు.. ఇక, సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం 20 మంది పేర్లపై చర్చించాం. అయితే, ఇప్పటివరకు ఆదివాసీ, గిరిజనులు రాష్ట్రపతి కాలేదు.. అందుకే ఆ వర్గం వారికి అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చామని.. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశామని వెల్లడించారు జేపీ నడ్డా.
అయితే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం వెనుక.. ఆ వర్గం ఓట్లను ఆర్షించడమే టార్గెట్‌గా భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నమాట.. రాష్ట్రపతి ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) మద్దతు తమకు లభిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది.. ఇక, వివాదాలకు దూరంగా ఉన్న ద్రౌపది మంచిపేరే సంపాదించారు.. జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్షాల ప్రశంసలు కూడా అందుకున్నారు.. అంతేకాదు, జేఎంఎం చీఫ్ శిబూ సోరెన్‌తోపాటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. దీంతో, వారి మద్దతు తమకు లభిస్తుందని బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. మరోవైపు, బీజేపీకి ఆదివాసీల ఓట్ల షేర్ కూడా పెరుగుతుందని.. ఒడిశాలో పార్టీకి మద్దతు పెరుగుతుందని వారి ప్లాన్‌గా ఉందంటున్నారు.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది.
ఇక, ద్రౌపది ముర్ము తన జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు.. ఎత్తు పల్లాలు చూసిన వ్యక్తి ఆమె.. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జన్మించిన ద్రౌపది.. శ్యామ్ చరణ్ ముర్మును పెళ్లి చేసుకున్నారు.. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా.. భర్త, ఇద్దరు కుమారులు మృతిచెందడం ఆమె జీవితంలో విషాదాన్ని నింపింది.. అయినా.. ఆ బాధను దిగమింగుకుని ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి టీచర్ ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ద్రౌపది.. 1997లో ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్ జిల్లా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ముర్ము సరిగ్గా అదే సంవత్సరం రాయరంగ్‌పూర్ వైస్-ఛైర్‌పర్సన్ అయ్యారు. 2000 అసెంబ్లీ ఎన్నికలలో, ఆమె అదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు మరియు 2002 వరకు రవాణా మరియు వాణిజ్య శాఖ మంత్రిగా చేశారు. ఒడిశా ప్రభుత్వం ఆమెకు 2002లో ఫిషరీస్ మరియు పశుసంవర్ధక శాఖను అప్పగించింది.. ఆమె 2004 వరకు ఆ పదవిలో పనిచేశారు.. ముర్ము 2002 నుండి 2009 వరకు మయూర్‌భంజ్ జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2004లో, ఆమె రాయంగ్‌పూర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకు పనిచేశారు. భారతీయ జనతా పార్టీ ఆమెను 2006లో ఒడిశా షెడ్యూల్డ్ తెగ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపిక చేసింది.. 2009 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆమె మళ్లీ 2010లో మయూర్‌భంజ్ జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 2013లో ఆమె మూడోసారి అదే జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలయ్యారు. ఆమె ఏప్రిల్ 2015 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఇక, ఆమె ఎన్నిక లాంఛనమే అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది బీజేపీ.
