Site icon NTV Telugu

Delimitation: “డీలిమిటేషన్‌”పై దక్షిణాది రాష్ట్రాల భయం ఏమిటి..? నియోజకవర్గాల పునర్విభజపై పూర్తి సమాచారం..

Delimitation

Delimitation

Delimitation: ప్రస్తుతం ‘‘డీలిమిటేషన్’’ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ‘‘జనాభా నియంత్రణ’’ పద్ధతులు పాటించడం ద్వారా పార్లమెంట్ స్థానాలు తగ్గే అవకాశం ఉందని స్టాలిన్ చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎంపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

డీలిమిటేషన్ అంటే ఏమిటి..?

జనాభాలో మార్పుల ఆధారంగా పార్లమెంటరీ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్ని తిరిగి మార్చడాన్ని డీలిమిటేషన్ అంటారు. జనాభా ప్రాతిపదికన మెరుగైన ప్రాతినిధ్యం కల్పించేదిగా దీనిని విశ్వసిస్తారు. షెడ్యూల్డ్ కులాలు (SC) మరియు షెడ్యూల్డ్ తెగలు (ST) కు ఎన్ని సీట్లు రిజర్వ్ చేయాలో కూడా ఇది నిర్ణయిస్తుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం, ప్రతీ జనాభా లెక్కల తర్వాత, నియోజకవర్గాల సంఖ్య, వాటి సరిహద్దులను సర్దుబాటు చేస్తారు. తాజా జనాభా లెక్కల డేటా ఆధారంగా, పార్లమెంట్ చట్టం ద్వారా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది.

డీలిమిటేషన్ చరిత్ర:

1951 జనాభా లెక్కల ప్రకారం, 495 సీట్లు(జనాభా 36.1 కోట్లు, ఒక్కో సీటుకు 7.3 లక్షల మంది), 1961లో జనాభా లెక్కల ప్రకారం, 522 సీట్లు ( జనాభా 43.9 కోట్లు, ఒక్కో సీటుకు 8.4 లక్షల మంది), 1971 జనాభా లెక్కల ప్రకారం, 543 సీట్లు (జనాభా 54.8 కోట్లు, ఒక్కో సీటుకు 10.1 లక్షల మంది)గా నిర్ణయించబడింది.

1971 తర్వాత దేశంలో ‘జనాభా నియంత్రణ’ కార్యక్రమాల వేగం పెరగడంతో, అప్పటి నుంచి డీలిమిటేషన్‌ని 25 ఏళ్ల పాటు నిలిపేశారు. 2000 వరకు ఇది అమలులో ఉంది. 2001లో 84వ సవరణ చట్టంతో, 2026 వరకు అంటే మరో 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పెంపుని వాయిదా వేశారు. ప్రస్తుతం లోక్‌సభలో 543, రాజ్యసభలో 250 సీట్లు ఉన్నాయి. అయితే, 2001లో సీట్ల సంఖ్యను మార్చకుండానే, నియోజకవర్గాల సరిహద్దులు సర్దుబాటు చేశారు. 2026లో మరోసారి వీటిని రివ్యూ చేయబడతాయి. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల తర్వాతే మార్పులు చేయబడుతున్నాయి.

దక్షిణాది భయాలు ఇవే:

కోవిడ్ మహమ్మారి కారణంగా 2021 జనాభా లెక్కలు ఆలస్యమయ్యాయి. 2026 సమీపిస్తున్న తరుణంలో డీలిమిటేషన్‌పై కసరత్తు మొదలైంది. అయితే, జనాభా ఉత్తరాదిన పెరగడం, దక్షిణాదిన జనభా తగ్గడం చూస్తే, తమ సీట్లు తగ్గుతాయని తమిళనాడు వంటి రాష్ట్రాలు భయపడుతున్నాయి. దీనికి ఇంకో కారణం ఏంటంటే, డీలిమిటేషన్ కసరత్తు మొత్తం పార్లమెంటరీ సీట్లను మార్చకుండానే నియోజకవర్గాలను పెంచవచ్చు, తగ్గించవచ్చు లేదా మార్చవచ్చు. ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల అనుమానాలు మొదలయ్యాయి. ఉత్తరాదిన స్థానాలు పెరిగి, దక్షిణాదిన తమ సీట్ల సంఖ్యను తగ్గిస్తారేమో అని భయపడుతున్నాయి.

2026 నాటికి, దేశ జనాభా 1.41 బిలియన్లకు చేరుకుంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. 1951, 1961, 1971 జనాభా ఆధారంగా చూస్తే, ఇప్పుడున్న జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల 543 నుంచి 753కి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 543 లోక్‌సభ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 129 స్థానాలు ఉన్నాయి. తెలంగాణకు 17, ఏపీకి 25, కేరళకి 20, తమిళనాడుకు 39 సీట్లు, కర్ణాటకకు 28 సీట్లు ఉన్నా్యి. మొత్తం దక్షిణాది ప్రాతినిధ్యం 24 శాతంగా ఉంది.

20 లక్షల జనాభా నిష్పత్తి ఆధారంగా మాత్రమే పరిశీలిస్తే, మొత్తం లోక్‌సభ సీట్లు 753 అవుతాయి. దక్షిణాదికి 144 సీట్లు దక్కే అవకాశంగా కనిపిస్తోంది. ఇందులో తెలంగాణకు 20, ఏపీకి 28, కేరళకు 19, తమిళనాడుకు 41, కర్ణాటకకు 36 సీట్లు వస్తాయని అంచనా. మరోవైపు యూపీలో సీట్ల సంఖ్య 80 నుంచి 128కి, బీహార్‌లో 40 నుంచి 70కి, మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్‌లో 25 నుంచి 44 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గడం ఇక్కడ ప్రధాన సమస్య.

Exit mobile version