West Nile fever: కేరళలో కొత్త వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలో ‘వెస్ట్ నైలు ఫీవర్’’ అనే జ్వరం సోకుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 కేసులు నమోదైనట్లుగా కేరళ ఆరోగ్యమంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కేసుల పట్ల అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అయితే, ఈ జ్వరం కేరళలో నమోదవ్వడం ఇప్పుడే తొలిసారి కాదు. 2011లో కేరళలో ఈ జ్వరాన్ని తొలిసారిగా గుర్తించారు. 2019లో మలప్పురానికి చెందిన ఆరేళ్ల బాలుడు ఈ జ్వరంతో మరణించాడు. మళ్లీ 2022లో త్రిసూర్ జిల్లాలో 47 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
వెస్ట్ నైలు జ్వరం అంటే ఏమిటి..? లక్షణాలు..
1937లో ఉగాండాలో తొలిసారిగా ఈ ‘‘వెస్ట్ నైలు వైరస్’’ని గుర్తించారు. ఇది క్యూలెక్స్ జాతి దోమల ద్వారా వ్యాప్తిస్తుంది. ఈ దోమ కాటుకు గురైతే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పక్షులను దోమలు కుట్టిన సందర్భంలో ఇది దోమశరీరంలోకి ఆ తర్వాత మనిషిని కుట్టడం ద్వార మనిషి శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 110 కంటే ఎక్కువ పక్షి జాతులు ఈ వైరస్‌ని కలిగి ఉంటాయి. వేసవి కాలంలో దోమ కాటుకు గురైతే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: Rajamouli: ‘బాహుబలి’ని మీరే చంపుకుంటున్నారా ? అంటే జక్కన్న సమాధానం ఇదే!
లక్షణాలు:
వైరస్ సోకిన తర్వాత తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందికి జ్వరం, తలనొప్పి, వాంతులు మరియు దురద వంటి లక్షణాలు ఉంటాయి మరియు ఒక శాతం కేసులలో మెదడు దెబ్బతినడం వల్ల అపస్మారక స్థితికి మరియు కొన్నిసార్లు మరణానికి దారితీస్తుందని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ వైరస్ వల్ల ప్రజలు చనిపోతారా..?
వ్యాధి సోకిన చాలా మందికి చిన్నపాటి అనారోగ్యం ఉంటుంది. కానీ వృద్ధులు, పిల్లలు వంటి బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారు ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జపనీస్ ఎన్సెఫాలిటిస్‌తో పోలిస్తే మరణాల రేటు సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. రిపోర్టుల ప్రకారం, వెస్ట్ నైలు ఫీవర్ మానవుల్లో ప్రాణాంతక నాడీ సంబంధిత వ్యాధికి కారణమవుతుంది.
దీనిని గుర్తించేందుకు ఈ వైరస్ ప్రతినిరోధకాల కోసం రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ వైరస్‌కి మందులు, వ్యాక్సిన్ అందుబాటులో లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ పనిచేయవు. తీవ్రమైన సందర్భాల్లో ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, నొప్పి మందులు, నర్సింగ్ కేర్ వంటి సౌకర్యాలు అందించాలి.
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడటం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. ఒకసారి ఈ వైరస్ సోకితే మళ్లీ జీవితాంతం ఇమ్యూనిటీ ఉంటుందని నమ్ముతారు. అయితే కొన్ని సందర్భాల్లో బలహీనమైన ఇమ్యునిటీ ఉన్న వారికి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.