2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు

  • బెంగాల్ ఫేజ్-1, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
  • సా.5 గంటల వరకు జరగనున్న పోలింగ్
Polling

Polling

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఫేజ్-1 ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎండకాలం కావడంతో వడగాల్పుల భయంతో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు.

బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండగా ఈరోజు 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి, టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది.  234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఇక రెండో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. అనంతరం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.

ఓటర్లకు మోడీ విజ్ఞప్తి
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభమైన సందర్భంగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ‘‘పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని ఓటర్లందరూ ప్రజాస్వామ్యమనే ఈ పవిత్ర కర్తవ్యంలో ఉత్సాహంగా పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటు వేయడానికి ముందుకు రావాలని నేను కోరుతున్నాను.’’ అని మోడీ పేర్కొన్నారు.

అమిత్ షా..
బెంగాల్ తల్లీకూతుళ్ల భద్రత కోసం ఓటు వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఈరోజు బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ బెంగాల్ ఎన్నికలు రాష్ట్ర వర్తమానానికీ, భవిష్యత్తుకూ కీలకం. బెంగాల్ జనాభా స్వరూపాన్ని మార్చేస్తున్న చొరబాటుదారులు, సిండికేట్లు, కట్-మనీ పాలన నుంచి రాష్ట్రాన్ని బలమైన నాయకత్వం ఉన్న ప్రభుత్వం మాత్రమే విముక్తి చేయగలదు. బెంగాల్ తల్లులు, కుమార్తెల కోసం సురక్షితమైన బెంగాల్‌ను నిర్మించడానికి ఈరోజు పెద్ద సంఖ్యలో ఓటు వేయండి. సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన బెంగాల్‌ను నిర్మించడానికి ఓటర్లందరూ..ముఖ్యంగా యువత, ముందుగా ఓటు వేసి, ఆ తర్వాత ఈరోజు అల్పాహారం తీసుకోవాలి.’’ అని పేర్కొన్నారు.