Site icon NTV Telugu

Mamata Banerjee: వైద్యులపై మమత కరుణ.. భారీగా జీతాలు పెంపు

Mamata Banerjee

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వైద్యులపై కరుణ చూపించారు. ఒకేసారి భారీగా జీతాలు పెంచారు. ప్రభుత్వ వైద్యులకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. అలాగే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునేందుకు దూర పరిమితిని 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు పెంచారు. ఇక ప్రభుత్వ వైద్యుల జీతాలు పెంచిన మమతా బెనర్జీ.. ఆర్జీ కర్ కేసు దోషికి కఠిన శిక్ష విధించాలని తాజాగా మరోసారి డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi into Custody: వంశీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. నేడు పోలీసు కస్టడీకి..

మమతా బెనర్జీ ముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు ఆరోగ్య శాఖను కూడా ఆమెనే నిర్వర్తిస్తున్నారు. వైద్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో వైద్యుల పాత్రను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె.. సీనియర్ వైద్యులకు రూ. 15,000, ఇంటర్న్‌లు, హౌస్ స్టాఫ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలతో సహా జూనియర్ వైద్యులకు రూ. 10,000 జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు.

‘‘సీనియర్ వైద్యులు.. జూనియర్ వైద్యులకు చాలా విషయాలు బోధిస్తారు. సి-సెక్షన్ లేదా కార్డియాక్ సర్జరీ అయినా ప్రతిదీ జూనియర్లపై వదిలివేయవద్దని నేను సీనియర్ వైద్యులను అభ్యర్థిస్తాను. ప్రభుత్వ ఆసుపత్రులకు కనీసం ఎనిమిది గంటలు మీ సేవను ఇవ్వండి. తరువాత మీ ప్రైవేట్ ప్రాక్టీస్‌ను కొనసాగించండి. దానితో నాకు ఎటువంటి సమస్య లేదు.”అని మమత స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాలకు.. సాంస్కృతిక మరియు క్రీడా కార్యకలాపాల కోసం రూ. 2 కోట్ల నిధిని ప్రకటించారు.

వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్ని్కలు జరగనున్నాయి. ఒంటరిగానే బరిలోకి దిగుతామని.. ఎవరితోనూ పొత్తు ఉండదని ఇప్పటికే మమత స్పష్టం చేశారు. నాలుగోసారి కూడా తమదే అధికారమని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా సన్నద్ధం అయిపోతున్నాయి. అయితే గతేడాది ఆర్‌ జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇక నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. భద్రత కోసం వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మొత్తానికి వైద్యులను మచ్చిక చేసుకునేందుకు మమత వరాల జల్లు కురిపించారు.

ఇది కూడా చదవండి: Covid 19 : ఐదేళ్ల తర్వాత కూడా కరోనా ఎంత ప్రమాదకరం.. అమెరికా నుండి షాకింగ్ నివేదిక

Exit mobile version