Kalita Majhi: పశ్చిమ బెంగాల్‌లో సరికొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ రోజు మంత్రివర్గాన్ని విస్తరించింది. సీఎం సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 రోజుల తర్వాత (దాదాపు మూడు వారాలకు) సోమవారం నబన్నాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. తాజా విస్తరణలో 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విస్తరణతో రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య 6 నుంచి 41కి చేరింది. 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నిబంధనల ప్రకారం గరిష్టంగా 44 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
సామాజిక సమీకరణాలు – ప్రాంతీయ సమతుల్యత
బీజేపీ తన తొలి మంత్రివర్గ కూర్పులో ప్రజలలోని అన్ని వర్గాలకూ, ప్రాంతాలకూ సముచిత స్థానం కల్పించింది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్ ప్రాంతానికి ఈ మంత్రివర్గంలో బలమైన ప్రాతినిధ్యం లభించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన నిసిత్ ప్రమణిక్‌తో పాటు శంకర్ ఘోష్, బిశాల్ లామా, జువల్ ముర్ము, ఆనందమోయ్ బర్మన్, దీపక్ బర్మన్, మాలతి రభా రాయ్ వంటి ఉత్తర బెంగాల్ నేతలకు చోటు దక్కింది. ఇదే ప్రాంతానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర ఘోష్ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. మే 9న జరిగిన తొలి ప్రమాణ స్వీకారంలోనే వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అగ్నిమిత్ర పాల్ (మహిళా ప్రతినిధి), అశోక్ కీర్తానియా (మటువా కమ్యూనిటీ), నిసిత్ ప్రమణిక్ (రాజబన్షీ కమ్యూనిటీ), క్షుదిరామ్ టుడు (గిరిజన కమ్యూనిటీ)లను మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
మంత్రివర్గ వివరాలు ఇవే..
నేటి విస్తరణలో 13 మంది క్యాబినెట్ మంత్రులు, ముగ్గురు స్వతంత్ర బాధ్యత గల సహాయ మంత్రులు, 19 మంది సహాయ మంత్రులు (రాష్ట్ర మంత్రులు) ప్రమాణ స్వీకారం చేశారు.
క్యాబినెట్ మంత్రులు (13 మంది): తపస్ రాయ్, దీపక్ బర్మన్, శంకర్ ఘోష్, అర్జున్ సింగ్, మనోజ్ ఓరాన్, గౌరీ శంకర్ ఘోష్, జగన్నాథ్ చటోపాధ్యాయ్, స్వపన్ దాస్‌గుప్తా, కళ్యాణ్ చక్రవర్తి, అనూప్ కుమార్ దాస్, అజయ్ కుమార్ పొద్దార్, శరదావత్ ముఖోపాధ్యాయ్, దుధ్ కుమార్ మండల్ క్యాబినెట్ మంత్రులగా ప్రమాణస్వీకారం చేశారు.
స్వతంత్ర బాధ్యత గల సహాయ మంత్రులు (ముగ్గురు): మాలతీ రభా రాయ్, ఇంద్రనీల్ ఖాన్, రాజేష్ మెహతా.
సహాయ మంత్రులు (19 మంది): అశోక్ దిండా, జోయెల్ ముర్ము, ఆనందమోయ్ బర్మన్, కౌశిక్ చౌదరి, గార్గీ దాస్ ఘోష్, భాస్కర్ భట్టాచార్య, దిబాకర్ ఘరామీ, సుమనా సర్కార్, శాంతను ప్రమణిక్, పూర్ణిమా చక్రవర్తి, ఉమేష్ రాయ్ తదితరులు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
మంత్రిగా.. కలితా మాఝీ
ఈ కేబినెట్ ఎంపికలలో అత్యంత ఆశ్చర్యపరిచే, స్ఫూర్తిదాయకమైన పేరు కలితా మాఝీ. తూర్పు బుర్ద్వాన్‌లోని ఔష్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి 12,535 ఓట్ల మెజారిటీతో గెలిచిన కలితా.. రాజకీయాల్లోకి రాకముందు నెలకు కేవలం రూ.2,500 సంపాదనతో ఇళ్లల్లో పనిమనిషిగా (గృహ సహాయకురాలిగా) పనిచేశారు. ఆమె భర్త ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. ఎంతో పోరాటంతో కూడిన జీవితాన్ని గడిపిన ఆమెకు సువేందు క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కడం విశేషం. ఆమె రాజకీయ ప్రస్థానం నిజంగా ఆశ్చర్యకరం. తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడే కలితా మాఝీ రాజకీయాల్లోకి ప్రవేశించి విజయం సాధించడం ఎంతో మందికి ప్రేరణ కలిగించే విషయం. ముఖ్యంగా ఈ రోజుల్లో రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్న క్రమంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం అనేది సామాన్య విషయం కాదు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను 2014లో పార్టీ బూత్ ఏజెంట్‌గా ఉన్నా. ఆ తర్వాత 2019లో నాకు గుస్కురా పట్టణ పార్టీ కార్యదర్శిగా పని చేసే అవకాశం వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు పార్టీ టికెట్ ఇచ్చింది” అని ఆమె చెప్పారు. ఆ ఎన్నికలో ఆమె టీఎంసీకి అభ్యర్థి అభేదానంద థండర్ చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయ ప్రస్థానం కొనసాగించింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బుర్ద్వాన్‌లోని ఔష్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్‌ను 12,535 ఓట్ల తేడాతో ఓడించి విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో నయా సంచలనాన్ని నమోదు చేశారు.
