నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వెళ్తోంది.. తాజాగా, నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయాన్ని కూడా సీజ్ చేసింది.. తాజా పరిణామాలపై స్పందించిన రాహుల్ గాంధీ… నరేంద్ర మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు బీజేపీ అణిచివేత ఎత్తుగడల్లో భాగమని.. కానీ, బీజేపీకి తాము భయపడబోమని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు బీజేపీ బెదిరింపు వ్యూహమని అభిప్రాయపడ్డ రాహుల్.. మేం భయపడం.. ఏమి చేసినా ఓకే అన్నారు.. మన దేశాన్ని, దాని ప్రజాస్వామ్యాన్ని మరియు సోదరభావాన్ని రక్షించడానికి నేను పని చేస్తూనే ఉంటానని ప్రకటించారు.. కొంచెం ఒత్తిడి తెస్తే మౌనంగా ఉంటారని వారు అనుకుంటున్నారు.. మేం మౌనంగా ఉండబోం.. బీజేపీ చేస్తున్న దానికి వ్యతిరేకంగా నిలబడతాము, భయపడబోం అన్నారు..
Read Also: CM YS Jagan Mohan Reddy: రంగంలోకి వైఎస్ జగన్.. కుప్పం నుంచే స్టార్ట్..!
మనీలాండరింగ్ కేసులో భాగంగా ఢిల్లీలోని కాంగ్రెస్ యాజమాన్యంలోని నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలోని యంగ్ ఇండియన్ ప్రాంగణాన్ని ఈడీ తాత్కాలికంగా సీల్ చేసిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.. అయితే, ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రాంగణాన్ని తెరవరాదని కూడా ఈడీ ఆదేశించింది. హెరాల్డ్ హౌస్ భవనంలో మిగిలిన నేషనల్ హెరాల్డ్ కార్యాలయం మాత్రం తెరిచే ఉంది.. ఇక, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించిన వారం తర్వాత నేషనల్ హెరాల్డ్-AJL-యంగ్ ఇండియన్ డీల్‌లోని బహదూర్షా జాఫర్ మార్గ్ కార్యాలయం మరియు 11 ఇతర ప్రదేశాల్లో ఏకకాలంలో మంగళవారం ఈడీ అధికారులు దాడులు చేశారు.. ఇప్పటికే రాహుల్ గాంధీని కూడా ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. యంగ్ ఇండియన్ ఆఫీస్ ప్రాంగణాన్ని ఈడీ తాత్కాలికంగా సీల్ చేసిన వెంటనే విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, అజయ్ మాకెన్, అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పార్టీ బెదిరిపోదని ప్రకటించారు.
