MK Stalin: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలోకి రాకుండా చూడటం, ప్రధాని మోదీ మళ్లీ ప్రధాని కాకుండా చూడటం తమ లక్ష్యమని, విపక్షాలు అందుకోసమే ప్రయత్నిస్తున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూఖ్ అబ్దుల్లా కోరడంపై మాట్లాడుతూ.. తాను ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనే నిమగ్నమై ఉన్నానని స్టాలిన్ అన్నారు.
Read Also: Rajnath Singh: రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నా..
ఎవరు ప్రధాని కావాలి, ఎవరు కాకూడదు, ఏ పార్టీ అధికారంలో ఉండాలి అనేది మా పాలసీ కాదని, ప్రస్తుతానికి మాత్రం 2024 ఎన్నికల్లో బీజేపీ గెలుపొందకుండా, నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. నిన్న జరిగిన సమావేశంలో కూడా ఇదే చెప్పానని గుర్తు చేశారు. ఈరోడ్-వెస్ట్ ఉపఎన్నికల్లో డీఎంకేని గెలిపించిన దాని కన్నా భారీ మెజారిటీతో లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపిస్తారని నమ్మకం ఉన్నట్లు వెల్లడించారు. బీజేపీని ఓడించాలి, ప్రతిపక్షాలు ఏకం చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరారు.
బుధవారం రోజుల చెన్నైలో స్టాలిన్ 70వ జన్మదినోత్సవం సందర్భంగా భారీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ కాన్ఫరెన్స్, కాశ్మీరీ నేత ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ హాజరు అయ్యారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా నేతలు మాట్లాడారు.
