NTV Telugu Site icon

Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. కాఫీ షాప్‌ ఉద్యోగం కోసం బారులు..

Canada

Canada

Canada: ఎన్నో ఆశలతో భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే బాటపడుతున్నారు. విదేశాల్లో చదువులు, ఉద్యోగాల కోసం భారతీయ సమాజంలో ఆసక్తి బాగా ఉంది. తమ కొడుకు, కుమార్తెలు విదేశాల్లో చదువుకోవాలని అప్పులు, తిప్పలు పడుతూ పేరెంట్స్ వారిని పంపుతున్నారు. చాలా సందర్భాల్లో విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు, పార్ట్‌టైమ్ జాబులు చేస్తూ విద్యను కొనసాగిస్తున్నారు.

అయితే, పార్ట్‌టైమ్ జాబ్ ఎంత కష్టమో కెనడాలోని ఈ పరిస్థితిని చూస్తే తెలుస్తోంది. టిమ్ హోర్టన్స్ అనే ప్రసిద్ధ కాఫీ, ఫాస్ట్ ఫుడ్ షాపులో ఉద్యోగాలు వెతుక్కోవడానికి భారతీయ, విదేశీ విద్యార్థులు బారులుతీరిన దృశ్యాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. టొరంటోలోని భారతీయ విద్యార్థి నిషాత్, టిమ్ హార్టన్స్ అవుట్‌లెట్ వెలుపల ఉన్న దరఖాస్తుదారుల సుదీర్ఘ క్యూ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో కెనడాలో పార్ట్‌టైమ్ ఉపాధి కోసం పోటీ ఎలా ఉందో హైలెట్ చేస్తుంది.

Read Also: Gautam Adani Salary: ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడైన.. గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా?

నిషాత్ తాను టొరంటోలో విద్యార్థినని, పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం నెల రోజులుగా వెతుకుతున్నట్లు చెప్పారు. ‘‘ కాఫీ షాపులో జాబ్ మేళా కోసం 30 నిమిషాలు ముందుగానే వెళ్లినప్పటికీ అక్కడ పెద్ద క్యూ కనిపించింది. అప్పటికే 100 మందికి పైగా విద్యార్థులు జాబ్ మేళాకు హాజరయ్యారు. ఈ క్యూ చూసి పక్కనే ఉన్న కెనడా దేశస్తులు అక్కడ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోయారు’’ అని నిషాత్ చెప్పుకొచ్చారు. టిమ్ హోర్టన్స్ సిబ్బంది వారి రెజ్యూమ్‌లను సేకరించారని, వారి షెడ్యూల్‌ల గురించి అడిగి తెలుసుకుని వారిని అక్కడ నుంచి పంపించారు.

నిషాత్ అక్కడ నుంచి నగరంలోని వేరే ప్రాంతంలోని షాపులో పార్ట్‌టైమ్ జాబ్ వెతికేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ‘‘నాకు ఏ దుకాణంలోనైనా ఉద్యోగం దొరుకుతుందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఇది నా పోరాటంతో నిండిన రోజు’’ చెప్పారు. వైరల్‌గా మారిన ఈ వీడియో కెనడాలో ఉద్యోగ సంక్షోభం, పెరుగుతున్న నిరుద్యోగాన్ని హైలైట్ చేస్తుంది. అనేక మంది భారతీయ విద్యార్థులు తాము కూడా దేశంలో ఉద్యోగాల కోసం చూస్తున్నామని, అయితే ఇంతవరకు తమకు అదృష్టం లేదని చెప్పారు. ఒక యూజర్ మాట్లాడుతూ.. 6 నెలల నుంచి పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం చూస్తు్న్నానని చెప్పారు. మరొకరు ‘‘తాను 8 ఏళ్ల క్రితం వచ్చిన కెనడా కాదని చెప్పారు. తాను ఇక్కడికి వచ్చినప్పుడు 2 వారాల్లోనే పార్ట్ టైమ్ వచ్చిందని, ఇప్పుడు పరిస్థితి హృదయాన్ని కదిలించిందని చెప్పారు. ఇక్కడికి రావాలనుకుంటున్న విద్యార్థులు దయచేసి మోసపోకండి అంటూ సూచించారు.