Balasaheb Thackeray: శివసేన వ్యవస్థాపకులు, దివంగత బాలాసాహెబ్ ఠాక్రే జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన తన విశ్వాసాల విషయంలో ఎక్కడ రాజీ పడలేదని, భారతీయ సంస్కృతి గర్వాన్ని పెంచడానికి ఎల్లప్పుడూ కృషి చేశారని ప్రధాని అన్నారు. ఎక్స్ వేదికగా ‘‘ బాలాసాహెబ్ థాకరే జీ జయంతి సందర్భంగా నేను ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఆయనను విస్తృతంగా గౌరవిస్తారు. ప్రజా సంక్షేమం పట్ల, మహారాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన నిబద్ధత గుర్తుంచుకుంటారు. ఆయన తన ప్రధాన విశ్వాసాల విషయంలో రాజీపడలేదు, భారతీయ సంస్కృతి యొక్క గర్వాన్ని పెంపొందించడానికి ఎల్లప్పుడూ దోహదపడ్డారు.’’ అని అన్నారు.
Read Also: Harish Rao: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే.. తల్లికి వచ్చే పెన్షన్ ఆపడం అన్యాయం!
జనవరి 23, 1926న పూణేలో జన్మించిన బాలాసాహెబ్ ఠాక్రే, నవంబర్ 17, 2012లో 86 ఏళ్ల వయసులో ముంబైలో మరణించారు. హిందుత్వం ఆధారంగా ‘‘శివసేన’’ పార్టీని స్థాపించారు. ఆయనకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా నివాళులు అర్పిస్తూ.. ‘‘హిందూ హృదయ సామ్రాట్ పూజ్య బాలాసాహెబ్‌కి మహారాష్ట్ర నివాళులు’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఉపముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా ఆయనకు నివాళులు అర్పించారు.
హిందుత్వ ఆధారంగా ఏర్పడిన శివసేన. 2022లో విడిపోయింది. సహాజ భాగస్వామిగా పరిగణించే బీజేపీని కాదని ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకలవడంతో ఈ పరిణామం జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే వైపు ఉండటంతో అతడిదే అసలైన శివసేన అని ఎన్నికల సంఘం గుర్తించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే కూటమి ఘన విజయం సాధించింది. మరోవైపు బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయారు.