VS Babu: సొంత ఇలాకాలో కుప్పకూలిన సీఎం స్టాలిన్.. సీఎంను కోటను పెకిలించిన వి.ఎస్. బాబు ప్రస్థానం ఇదే!

Tollywood

Tollywood

VS Babu: తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాన్య అభ్యర్థి సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఓడించడం అనేది దాదాపు అసాధ్యం. కానీ 2026 అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి వి.ఎస్. బాబు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. కొలత్తూరు నియోజకవర్గంలో ఎం.కె.స్టాలిన్‌ను ఓడించి, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు.

ఎవరీ వి.ఎస్. బాబు..
వి.ఎస్. బాబు తమిళనాడు రాజకీయాల్లో నిన్నమొన్న వచ్చిన వ్యక్తి కాదు. ఆయన చెన్నై రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. 2006 శాసనసభ ఎన్నికల్లో పురసవాక్కం నియోజకవర్గం నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2006 నుంచి 2011 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నీటి సరఫరా, గృహ నిర్మాణ సమస్యలపై పోరాడి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

టీవీకేలో చేరిక.. కీలక మలుపు
దశాబ్దాల పాటు ద్రవిడ రాజకీయాల్లో ఉన్న బాబు, ఫిబ్రవరి 7, 2026న నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీలో చేరారు. విజయ్ నాయకత్వంలోని కొత్త శక్తికి బాబు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు తోడవ్వడం ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. విజయ్ కూడా ఆయనపై నమ్మకంతో ఏకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరు బరిలో నిలబెట్టారు. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో బాబు ఏకంగా సీఎం స్టాలిన్‌ను తన కంచుకోటగా భావించే కొలత్తూరులో మట్టికరిపించారు. నిజానికి ఈ ఎన్నికల్లో వి.ఎస్.బాబు కేవలం గాలివాటంగా గెలవలేదు. ఆయన ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెన్నై ఓటర్ల నాడి తెలిసిన నాయకుడిగా బాబు ప్రతి ఇంటిని పలకరించారు. సీనియర్ నాయకుడిగా బూత్ స్థాయిలో ఓటర్లను సమీకరించడంలో తన పాత అనుభవాన్ని రంగరించారు. ద్రవిడ పార్టీల పాలనపై ఉన్న అసంతృప్తిని తన వైపు తిప్పుకోవడంలో ఆయన సఫలమయ్యారు.

వి.ఎస్. బాబు రాజకీయ ప్రస్థానం ఇదే..
2006 లో డీఎంకే అభ్యర్థిగా పురసవాక్కం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2006-2011: శాసనసభ సభ్యునిగా పౌర సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర.

ఫిబ్రవరి 2026: డీఎంకేను వీడి తమిళగ వెట్రి కజగం (TVK)లో చేరిక.

మే 2026: కొలత్తూరులో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి ‘జెయింట్ కిల్లర్’గా గుర్తింపు.