Site icon NTV Telugu

Agnipath Scheme: ఆర్మీ స్కీమ్ పై ఆందోళన.. బీహార్ లో హింసాత్మక ఘటనలు

Agnipath

Agnipath

ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ ఆందోళలకు కారణం అవుతోంది. ముఖ్యంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో యువత ఆందోళన చేస్తోంది. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువకులు అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేఖిస్తున్నారు. ఆర్మీలో చేరడం మా ఆశ అని కేవలం నాలుగేళ్లకే సర్వీస్ పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీహార్ లో ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ పేరుతో ఆందోళనలు చేస్తున్నారు ఆర్మీ ఆశావహులు. నిన్నటి నుంచి బీహార్ వ్యాస్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. భభువా రోడ్ రైల్వే స్టేషన్ లో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ అద్దాలను పగలగొట్టారు నిరసనకారులు. ఒక కోచ్ కు నిప్పు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ స్కీమ్ ను వ్యతిరేఖిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అర్రా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు.. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులు స్టేషన్ ఫర్నిచర్ ను ట్రాక్ పై విసిరేసి నిప్పుపెట్టారు. జెహానాబాద్ లో ఆందోళనకారుల నిరసనతో రైల్వే ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. నవాడలో యువకులు రైళ్లను అడ్డుకుని ట్రాక్ పై టైర్లను తగలబెట్టారు.

మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో కలిసి అగ్నిపథ్ స్కీమ్ ను ప్రారంభించారు. ఈ స్కీమ్ వల్ల కొత్తగా 45 వేల మందిని ఆర్మీలోని వివిధ భాగాల్లోకి తీసుకోనున్నారు. అయితే 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు కలిగిన యువతీయువకులను నాలుగేళ్ల సర్వీస్ కోసం ఆర్మీలోకి తీసుకోనున్నారు. ఆ తరువాత కేవలం 25 శాతం మందినే ఆర్మీలో ఉంచుకుని, మిగతా వారికి రూ. 11-12 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ విరమణ చేసేలా స్కీమ్ తీసుకువచ్చారు. ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి పెన్షన్ వంటి సౌకర్యాలు ఉండవు. దీని వల్ల భారత ఆర్మీ రిజర్వ్ బేంచ్ స్ట్రెంత్ పెరగడంతో పాటు బడ్జెట్ లో భారీగా నిధులు మిగులుతాయని.. తద్వార కొత్త ఆయుధాలకు ఈ బడ్జెట్ ను ఉపయోగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Exit mobile version