NTV Telugu Site icon

Vinesh Phogat: రాజ్యసభకు వినేష్ ఫోగట్‌‌..! కాంగ్రెస్ ప్లాన్ ఇదేనా?

Vineshphogatmp

Vineshphogatmp

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు వేటుకు గురైన భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రాజ్యసభకు పంపాలని డిమాండ్ పెరిగింది. ఆమె బహిష్కరణకు గురైనప్పుడు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. తాజాగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా… వినేష్‌ను రాజ్యసభకు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ దీపిందర్‌ సింగ్ హుడా కూడా అదే పల్లవి అందుకున్నారు. ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఆమె.. రాజ్యసభ పదవికి తగిన వ్యక్తి అని దీపిందర్ హుడా వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై వినేష్ ఫోగట్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందించారు. భూపిందర్ సింగ్ హుడా కూడా హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గీతా ఫోగట్‌ను ఎందుకు రాజ్యసభకు పంపించలేదని ప్రశ్నించారు. గీతా మహవీర్ కుమార్తె. గీతా ఫోగట్ ప్రముఖ భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి. 2010లో జరిగిన కామన్ వెల్త్ ఆటల్లో భారతదేశానికి మొట్టమొదటిసారి బంగారు పతకం తెచ్చింది. ఒలంపిక్స్‌కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి కూడా గీతానే కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఒలింపిక్స్‌ ఫైనల్‌లో అనర్హతకు గురి కావడంతో వినేష్ మనస్తాపానికి గురైంది. దీంతో ఆమె రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘‘తల్లిలాంటి కుస్తీ నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక పోరాడే బలం లేదు. మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని వినేష్ పేర్కొంది.

తాజాగా కాంగ్రెస్‌ కొత్త పల్లవి అందుకోవడం వెనుక వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు వినేష్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో ఏదొకటి వినేష్‌కు కేటాయిస్తే.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి దోహదపడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా సమాచారం.