ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ విషయం ఏదైనా ఉందా అంటే అవి తమిళనాడు రాజకీయాలే అని చెప్పొచ్చు. తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మెజార్టీ నిరూపణకు విజయ్‌కు రేపటివరకు గవర్నర్ డెడ్‌లైన్ ఉండగా.. 118 మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ ప్రభుత్వ ఏర్పాటు క్లెయిమ్‌పై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు (మ్యాజిక్ ఫిగర్) నిరూపించాలని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయ్ వద్ద 112 మంది మద్దతు ఉంది.
కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 112కు చేరింది. మ్యాజిక్ ఫిగర్‌కు మరో 6 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు చిన్న పార్టీలు ససేమిరా అంటున్నాయి.. విజయ్‌కు షాక్ ఇచ్చిన కమ్యూనిస్టులు.. డీఎంకే కూటమిలోనే ఉంటామన్న వామపక్షాలు, ఐయూఎంఎల్.. ఇంకా నిర్ణయాన్ని ప్రకటించని వీసీకే.. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు పళనిస్వామి ఆసక్తి కనబర్చడం లేదు. గవర్నర్ స్పష్టమైన సంఖ్యాబలం కోరడంతో TVK ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవుతారా? లేదా అన్న విషయంపై సందిగ్ధం నెలకొన్నది.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు (సింపుల్ మెజారిటీ) అవసరం. TVK సొంతంగా 108 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ (5 సీట్లు) మద్దతుతో విజయ్ 112-113కి చేరుకున్నట్లు లేఖలు సమర్పించారు. గవర్నర్ ను విజయ్ కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం క్లెయిమ్ వేశారు. అయితే గవర్నర్ సంతృప్తి చెందకపోవడంతో 118 మంది మద్దతు లేఖలు తీసుకురమ్మని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో విజయ్ ప్రమాణ స్వీకారం రేపు జరగడం అనిశ్చితంగా మారింది.
గవర్నర్ రాజ్యాంగ ప్రకారం స్పష్టమైన మెజారిటీ లేకుండా ఆహ్వానం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. TVK వర్గాలు మాత్రం చిన్న పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నాయి. ఒకవేళ 118 సాధించలేకపోతే ఫ్లోర్ టెస్ట్ లేదా ఇతర మార్గాలు పరిశీలించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హై డ్రామాతో సాగుతున్నాయి. విజయ్ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
