Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను తండ్రి ఎంకే స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ఉద్దేశిస్తూ..‘‘మీ తండ్రి ఎక్కడ..?’’ అని సీఎం విజయ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనికి ప్రతిస్పందనగా విజయ్ తల్లిని ఉద్దేశిస్తూ నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ‘‘శాసనసభలో కొందరు తండ్రి కోసం వెతుకుతున్నారు. కానీ తండ్రి ఎవరో ఇంట్లో ఉన్న తల్లిని అడిగితే తెలుస్తుంది. అసెంబ్లీలో వెతికితే ఎవరు చెబుతారు? ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి ఇలాగే ఉంది’’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై విజయ్ పార్టీ టీవీకే తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేత తన పదవికి తగిన గౌరవాన్ని కాపాడుకోవాలని, ఈ వ్యాఖ్యలు వీధి నాయకుడు మాట్లాడే మాటల్లా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ అన్నారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చని, ప్రభుత్వ విధానాలను విమర్శించవచ్చని, కానీ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లిని అవమానించేలా మాట్లాడటం పూర్తిగా అంగీకారయోగ్యం కాదని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై మాజీ బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై కూడా స్పందించారు. నాగేంద్రన్ వ్యాఖ్యలు మర్యాద హద్దుల్ని దాటాయని అన్నారు. తమిళనాడు సీఎం విజయ్ తల్లిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం విచారకరమని ఎక్స్‌లో అన్నారు. రాజకీయాల్లో్ ఉన్నవారి మాటలు, చర్యలు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలను 30-40 ఏళ్ల క్రితం చెల్లుబాటు అయ్యే పాత తరహా రాజకీయాలుగా వర్ణించారు. తమిళ యువతకు ఇలాంటి చీప్ పాలిటిక్స్ నేర్పకూడదని అన్నారు.

