Hardeep Singh Nijjar: ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. హత్య జరిగిన 9 నెలల తర్వాత ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సీబీసీ న్యూస్ నివేదించింది. 2020లో భారత్ చేత టెర్రరిస్టుగా గుర్తించబడిన నిజ్జర్, జూన్ 18, 2023న గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్య చేయబడ్డాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా నుంచి బయటకు వస్తున్న క్రమంలో దాడి జరిగింది.
Read Also: Petrol Price : గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి.. మరి పెట్రోల్, డీజిల్‌పై ఉపశమనం ఎప్పుడు?
సీబీసీ న్యూస్‌లో ప్రసారమయ్యే కెనడియన్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఫిఫ్త్ ఎస్టేట్’ నుంచి ఈ వీడియో ఫుటేజ్ ప్రసారమైంది. నిజ్జర్ గ్రే కలర్ పికప్ ట్రక్‌లో గురుద్వారా పార్కింగ్ స్థలం నుంచి బయటకు వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలోనే తెల్లని సెడాన్ కార్ నిజ్జర్ ట్రక్కు ముందరకు వచ్చి అడ్డుకుంది. వెంటనే అందులో నుంచి ఇద్దరు దిగి నిజ్జర్‌ని కాల్చి చంపారు. ఘటన జరిగిన సందర్భంలో అక్కడే ఓ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్న ఇద్దరు ప్రత్యక్ష సాక్ష్యులు నిందితులను వెంబడించే ప్రయత్నం చేశారు. ప్రత్యక్ష సాక్ష్యలు భూపీందర్ సింగ్ సిద్ధూ, మల్కిత్ సింగ్ ఇద్దరు వ్యక్తులు పరిగెత్తడాన్ని చూశానని చెప్పారు.
నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ హత్య కేసు విచారణలో భారత్ సహకరించాలని కెనడా కోరింది. అయితే, కెనడా ఆరోపణలు నిరాధారమని, దీనికి సంబంధించిన వివరాలను తమకు ఇవ్వాలని కోరినప్పటికీ కెనడా స్పందించలేదు. మరోవైపు ఇరు దేశాల దౌత్యసంబంధాల్లో సమానత్వాన్ని పాటించేందుకు భారత్‌లో ఎక్కువగా ఉన్న దౌత్యవేత్తల బహిష్కరణ జరిగింది.
https://twitter.com/RealBababanaras/status/1766343430094139694
