NTV Telugu Site icon

Donald Trump: “ట్రంప్ తల తిప్పడమే ప్రాణాల్ని కాపాడింది”.. వైరల్ వీడియో..

Trump

Trump

Donald Trump: మాజీ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. పెన్సిల్వేనియా బట్లర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై కాల్పులు జరిగాయి. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు గన్‌తో కాల్చాడు. అయితే, బుల్లెట్ ట్రంప్ చెవి పక్క నుంచి వెళ్లింది. వెంట్రుకవాసిలో ట్రంప్ బుల్లెట్ నుంచి తప్పించుకున్నాడు. స్వల్పగాయాలు అయ్యాయి. వెంటనే తేరుకున్న ట్రంప్ నేలపై పడుకున్నాడు. ఆ తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌కి రక్షణగా నిలిచారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, ఒక ట్రంప్ మద్దతుదారు చనిపోయారు. అనంతరం నిందితుడని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హతమార్చారు.

Read Also: Emergency: ఎమర్జెన్సీ పొరపాటు, ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..

అయితే, ఈ అనూహ్యమైన ఘటన నుంచి ట్రంప్ రక్షించబడటానికి అతని చర్యే కారణమైంది. వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో, ట్రంప్ తన తలను తిప్పడంతో బుల్లెట్ గురి మిస్ అయినట్లు తెలుస్తోంది. లేకపోతే ట్రంప్ తలలోకి బుల్లెట్ చొచ్చుకుపోయేదే. ట్రంప్ తల తిప్పడంతో గురి మిస్ కావడంతో బుల్లెట్ ట్రంప్ చంప, చెవిని తాకుతూ స్వల్పగాయాలు చేస్తూ వెళ్లింది. గన్ ఫైర్ చేసిన కొన్ని క్షణాల్లోనే ట్రంప్ తన తలను మరోవైపు ఉన్న మద్దతుదారుల వైపు తిప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గన్ శబ్ధం వినిపించిన వెంటనే ట్రంప్ వెనక ఉన్న ఇద్దరు ఏజెంట్లు ట్రంప్‌కి రక్షణగా నిలిచేందుకు పరిగెత్తుకుంటూ రావడం వీడియోల రికార్డైంది. ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు బాగానే ఉన్నారని, కుడి చెవిపై గాయమైందని ట్రంప్ క్యాంపెయిన్ చెప్పింది. దాడి జరిగిన తర్వాత ట్రంప్ ముఖంపై రక్తం మరకలు ఏర్పడ్డాయి. వెంటనే తేరుకున్న ట్రంప్ పైకి లేచి, పిడికిలి బిగించి ‘‘ఫైట్, ఫైట్, ఫైట్’’ అంటూ మద్దతుదారుల్లో ధైర్యాన్ని నూరిపోశారు. ట్రంప్ మాట్లాడుతున్న వేదిక నుంచి 140 మీటర్ల దూరంలో ఓ భవనం పైకప్పు నుంచి నిందితుడు ఏఆర్-15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌లో కాల్పులు జరిపాడు. 1981లో రిపబ్లికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు లేదా ప్రధాన పార్టీ అభ్యర్థిపై కాల్పులు జరపడం ఇదే తొలిసారి. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.