NTV Telugu Site icon

Venkaiah Naidu: రాష్ట్రపతి ఎవరు అవుతారో!.. వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?

Venkaiah

Venkaiah

భార‌త రాష్ట్రప‌తిగా రామ్‌నాథ్ కోవింద్ జులై 24న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. కొత్త రాష్ట్రప‌తి జులై 25న ప‌ద‌వీ బాధ్యతలు చేప‌ట్టనున్నారు. ఈ క్రమంలో భార‌త నూత‌న రాష్ట్రప‌తిగా ఎవ‌ర‌న్న విష‌యాన్ని తేల్చేందుకు జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జులై 18న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా… కొత్త రాష్ట్రప‌తి ఎవ‌ర‌న్నది జులై 21న జ‌ర‌గ‌నున్న ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది. మ‌రి రాష్ట్రప‌తి అభ్యర్థిగా అధికార ఎన్డీఏ, విప‌క్ష యూపీఏలు ఎవ‌రిని బ‌రిలోకి దించుతాయ‌న్న విష‌యంపై అప్పుడే ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకేనన్నది స్పష్టమవుతోంది. అయితే రాష్ట్రపతి పదవి ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. సాధారణంగా ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనవారు తర్వాత రాష్ట్రపతిగా వెళ్లడానికి అవకాశాలుంటాయి. ఆ కోణంలో ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి పేరు ముందువరుసలో కనిపిస్తోంది. కానీ అభ్యర్థి ఎంపిక అధికారం ప్రధాని మోదీ చేతుల్లో ఉంటుంది కాబట్టి, ఆయన ఎవర్ని ఎంపిక చేస్తారన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఓ సెంటిమెంటు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటివరకూ 13 మంది ఉప రాష్ట్రపతులుగా చేస్తే, వారిలో తొలి ముగ్గురు రాష్ట్రపతి అయ్యారు. మలి ముగ్గురూ కాలేదు. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురూ అయ్యారు. మళ్లీ ముగ్గురు కాలేదు. ఆ సెంటిమెంట్‌ ఫలిస్తే వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉంటాయన్న చర్చ నడుస్తోంది.

 

Rajyasabha Polls: ఉత్కంఠగా రాజ్యసభ ఎన్నికలు..

ద‌క్షిణాది రాష్ట్రాల నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పించే దిశ‌గా బీజేపీ నిర్ణయం తీసుకుంటే… వివాదర‌హితుడిగా పేరున్న వెంకయ్యే ఎన్డీఏ అభ్యర్థిగా ఖరార‌య్యే అవ‌కాశాలున్నాయి. ఇక తెలంగాణ గ‌వ‌ర్నర్‌గా ప‌నిచేస్తున్న త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది. ద‌క్షిణాది రాష్ట్రాలు, మ‌హిళా కోటా అనుకుంటే త‌మిళిసైకి అవ‌కాశం ద‌క్కే ఛాన్సున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఏ అభ్యర్థులుగా మ‌రికొంద‌రి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో కేర‌ళ గ‌వ‌ర్నర్ ఆరిఫ్ మ‌హ్మద్ ఖాన్‌, అసోం గ‌వర్నర్ జ‌గ‌దీశ్ ముఖీ. ఝార్ఖండ్ మాజీ గ‌వ‌ర్నర్ ద్రౌప‌ది ముర్ము, ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్నర్ అన‌సూయ యూకీ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎస్టీ కేట‌గిరీకి చెందిన మ‌హిళా నేత ద్రౌప‌ది ముర్ము పేరు రేసులో ముందున్నట్లుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇక విప‌క్ష యూపీఏ శిబిరం విష‌యానికి వ‌స్తే… ఎన్సీపీ అధినేత‌, కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ ప‌వార్‌తో పాటు కేంద్ర మంత్రిగా, లోక్ స‌భ స్పీక‌ర్‌గానూ రాణించిన కాంగ్రెస్ పార్టీ మ‌హిళా నేత మీరా కుమార్‌లు రేసులో ఉన్నట్లు స‌మాచారం. అయితే యూపీఏ రాష్ట్రప‌తి అభ్యర్థిగా బ‌రిలో నిలిచేందుకు ఇదివ‌ర‌కే శ‌ర‌ద్ పవార్ ఆస‌క్తి చూప‌లేదు. అధికార ప‌క్షానికి స్పష్టమైన మెజారిటీ ఉన్న నేప‌థ్యంలో ఓడిపోతామ‌ని తెలిసి కూడా బ‌రిలో నిల‌వాల్సిన అవ‌స‌రం లేద‌న్న కోణంలో ప‌వార్ వ్యాఖ్యానించారు.