Vice President Candidate: ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించే విషయంలో ప్రతిపక్షాలు వెయిట్ అండ్ సీ పాలసీని ఫాలో అవుతున్నాయి. అందుకే ఇప్పటివరకు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. అధికార కూటమి (ఎన్‌డీఏ) క్యాండేట్ పేరును ప్రకటించాకే తమ అభ్యర్థి పేరును వెల్లడిస్తామని చెబుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలాగైతే ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపారో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కూడా అలాగే జాయింట్ క్యాండేట్‌ని పోటీకి దింపాలని నిర్ణయించారు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ కూటమి ద్రౌపదీ ముర్ము పేరును ప్రకటించకముందే విపక్షాలు యశ్వంత్‌సిన్హా పేరును డిక్లేర్ చేశారు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రూలింగ్ పార్టీ ఏ అభ్యర్థిని బరిలోకి దించుతుందో సరిగ్గా అదే స్థాయి, అలాంటి ప్రొఫైలే కలిగిన నాయకుణ్ని సెలెక్ట్ చేయాలని అపొజిషన్ పార్టీలు అనుకుంటున్నాయి. తద్వారా గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నిక ఇప్పటికే వన్ సైడ్ అయిన విషయం తెలిసిందే. ద్రౌపదీ ముర్ముకి రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది.
అందువల్ల వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇలా తేలిపోకూడదని ప్రతిపక్ష పార్టీలు ఆశిస్తున్నాయి. తామేంటో నిరూపించుకోవాలనే ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎన్‌డీఏకి అపొజిషన్ పార్టీలు ఛాలెంజ్ విసురుతున్నాయి. ద్రౌపదీ ముర్ము వెనకబడిన గిరిజన తెగకు చెందిన వ్యక్తి కావటంతోపాటు మహిళ అవటంతో ఎన్డీఏలో లేని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బలమైన రాష్ట్రపతి అభ్యర్థి కోసం విపక్షాలు కూడా పలువురి పేర్లను పరిశీలించినా, పోటీ చేస్తారా అంటూ అడిగినా వాళ్లు ముందుకు రాకపోవటంతో చివరికి యశ్వంత్‌సిన్హాను ఎంపిక చేశాయి.
ఉపరాష్ట్రపతి విషయంలో అటు అధికార పక్షం నుంచి గానీ ఇటు ప్రతిపక్షం నుంచి గానీ స్పష్టమైన ప్రకటనలు వెలువడట్లేదు. ఎన్డీఏ క్యాండేట్లుగా ఇద్దరు, ముగ్గురు నేతలు ప్రచారంలోకి వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు. బీజేపీ బహుశా ఇవాళ తన అభ్యర్థిని ప్రకటించొచ్చని అంటున్నారు. అపొజిషన్ ఇంత వరకూ ఒక్క పేరును కూడా తెర మీదికి తేలేదు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించటం కోసం ఏకతాటి మీదికి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ ఒకదానికొకటి టచ్‌లోనే ఉన్నాయి. అంతర్గతంగా చర్చలు జరుపుతూనే ఉన్నాయి. కానీ ఏమాత్రం లీకు చేయట్లేదు. దీంతో వైస్ ప్రెసిడెంట్ క్యాండేట్ అంశం ఆసక్తికరంగా మారింది.