Site icon NTV Telugu

Jammu Kashmir: స్కూల్స్‌లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి.. ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత..

Mirwaiz Umar Farooq

Mirwaiz Umar Farooq

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని అక్కడి ముస్లిం మతం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మత సంస్థల సమాఖ్య అయిన ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU) ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘‘బలవంతపు ఆదేశాలు’’గా అభివర్ణించింది. జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని స్కూళ్లలో విద్యార్థులు, సిబ్బంది సంగీత-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంఘాలు తప్పుపట్టాయి. ఇది అన్యాయమని, ఇస్లాంకు వ్యతిరేకం అని ఆరోపిస్తున్నాయి.

Read Also: Chelluboina Venugopal: కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా.. లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు!

ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU)కు నాయకత్వం వహిస్తున్న కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ ఈ ఆర్డర్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది ముస్లిం విద్యార్థులు, సంస్థలను వారి మత సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరించేలా బలవంతం చేస్తుందని అన్నారు. ముస్లింలకు వందేమాతరం పాడటం అనుమతించబడదు అని ఎంఎంయూ చెప్పింది. “వందేమాతరం పాడటం లేదా పఠించడం ఇస్లాంకు విరుద్ధం, ఎందుకంటే అందులో అల్లాహ్ యొక్క సంపూర్ణ ఏకత్వం (తౌహీద్) పై ప్రాథమిక ఇస్లామిక్ నమ్మకానికి విరుద్ధంగా భక్తి వ్యక్తీకరణలు ఉన్నాయి” అని మీర్వైజ్ కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది.

కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలు అక్టోబర్ 31- నవంబర్ 7, 2025 మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరింది, అక్కడ విద్యార్థులు,ఉపాధ్యాయులు జాతీయ గీతాన్ని పాడాలని చెప్పింది. ఈ ఆదేశాలు నిజమైన ఐక్యత, వైవిధ్యం పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడం కన్నా సాంస్కృతిక వేడుక ముసుగులో ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలాన్ని రుద్దే ప్రయత్నం అని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏ విద్యార్థి లేదా సంస్థ వారి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని బలవంతం చేయకుండా చూసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా , ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలను ఎంఎంయూ కోరింది

Exit mobile version