NTV Telugu Site icon

Marriage Cancel: రెండడుగులు పూర్తయ్యాక వధువు షాక్

Up Bride Calls Off Wedding

Up Bride Calls Off Wedding

పీటల మీదే పెళ్లి ఆగిపోయే దృశ్యాల్ని మనం నిన్నటివరకు సినిమాల్లోనే చూశాం.. ఇప్పుడు అలాంటి సంఘటనలు రియల్ లైఫ్‌లోనూ చోటు చేసుకుంటున్నాయి. ఏవేవో కారణాలు చెప్తూ.. స్వయంగా వధువులే పెళ్లిళ్లను ఆపేస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. ఏడు అడుగుల్లో భాగంగా రెండు అడుగులు పూర్తయ్యాక.. ‘నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు’ అంటూ వధువు పెద్ద షాకిచ్చింది. ఎంత చెప్పినా వధువు వినకపోవడంతో.. వ్యవహారం కోర్టుదాకా వెళ్లింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీతా యాదవ్, రవి యాదవ్‌కు పెళ్లిచూపులు నిర్వహించారు. అప్పుడు ఇద్దరూ ఒకరికొకరు నచ్చినట్టు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. అంగరంగ వైభంగా వివాహ ఏర్పాట్లు చేసి.. బంధువులు, మిత్రుల్ని పిలిచారు. గురువారం ఉదయం పెళ్లి తంతు ప్రారంభమైంది. మొదటగా పూల దండలు మార్చుకున్న వధువు, వరుడు.. అగ్ని గుండం చుట్టూ ఏడు అడుగులు నడిచేందుకు సిద్ధమయ్యారు. అయితే.. రెండు అడుగులు పూర్తయ్యాక వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తనకు అ పెళ్లి ఇష్టం లేదని బాంబ్ పేల్చింది. పెళ్లి చూపుల్లో తాను చూసింది ఇతడ్ని కాదని, ఈ వరుడు మరీ నల్లగా ఉన్నాడని పేర్కొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులందరూ వధువును పెళ్లికి ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు ఆరు గంటలపాటు వాళ్లు వధువును ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరికి పెళ్లి రద్దు చేశారు. దీంతో ఆగ్రహించిన వరుడు బంధువులు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. పెళ్లి సందర్భంగా వధువుకు బహుమతిగా ఇచ్చిన నగలను తిరిగి ఇప్పించాలని, తమకు జరిగిన నష్టానికి కూడా పరిహారం కట్టించాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.