NTV Telugu Site icon

Farmers Protest: “బలాన్ని ఉపయోగించడం..” రైతుల ఆందోళనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Farmers Protest

Farmers Protest

Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి పలు డిమాండ్లు చేస్తూ రైతులు “ఢిల్లీ ఛలో” మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులను అడ్డుకునేందుకు బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రైతుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారించింది.

Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం “ఎంఎస్‌పీ” చట్టం..

సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, బలప్రయోగం చివరి అస్త్రం కావాలని చీఫ్ జస్టిస్ జీఎస్ సంధావాలియా, జస్టిస్ లపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. నిరసనకారులు ఢిల్లీలోకి రాకుండా రోడ్లను దిగ్భందించాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక పిటిషన్‌లో తప్పుబట్టింది. రైతులు జాతీయ రహదారులను దిగ్భందించడం వల్ల ప్రజలు, ఇతర రోజూవారీ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని మరో పిటిషన్ ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

నిరసనకారులకు భావ వ్యక్తీకరణకు ప్రాథమిక హక్కు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పౌరులను రక్షించడంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. భావవ్యక్తీకరణ, మాట్లాడటం ప్రాథమిక్ హక్కుల్లో సమతుల్యత ఉండాలి, హక్కులు ఏవీ విడిగా ఉండవని, జాగ్రత్తను గుర్తుంచుకోవాలి, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, ప్రస్తుత వివాదంతో అన్ని పక్షాలు కూర్చోని చర్చించుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది, నిరసన తెలిపేందుకు స్థలాన్ని గుర్తించాలని కోరింది. తరుపరి విచారణ ఫిబ్రవరి 15న జరగనుంది.