India-China Border: 2024 ఆనువల్ థ్రెట్ అస్సెస్‌మెంట్ నివేదికలో భారత్, చైనాల మధ్య సాయుధ పోరాటం తప్పకపోవచ్చని యూఎస్ ఇంటెలిజెన్స్ అభిప్రాయపడింది. భారత సరిహద్దుల వెంబడి చైనా తన పుట్టగొడుగుల్లా గ్రామాలను విస్తరిస్తోందని చెప్పింది. భారత్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దళాల మోహరింపుకు చైనా ప్లాన్ చేస్తుందని, ఇది భారత్‌తో సాయుధ పోరాటానికి దారి తీసే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. వ్యూహాత్మక విస్తరణలో వాస్తవ నియంత్రణ రేఖకు ఎదురుగా తూర్పు, మధ్య ప్రాంతాల్లో చైనా గ్రామాల నెట్వర్క్‌ని విస్తరిస్తోంది.
ఇటీవల భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఏ సమయాల్లో అయిన భారత దళాలను సరిహద్దుల్లో మోహరించేందుకు ఉద్దేశింపబడిన ‘సెలా టన్నెల్’ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ టన్నెల్‌కి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉండటం చైనా జిత్తులమారి తనానికి నిదర్శనంగా నిలుస్తోంది. తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని చైనా తమ భూభాగంగా పేర్కొంటోంది. ఇది దక్షిణ టిబెట్ ప్రాంతంలో భాగమని వాదిస్తోంది. పలుమార్లు అరుణాచల్‌లోకి చైనా బలగాలు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయి, అయితే భారత సైన్యం వీరిని సమర్థవంతంగా అడ్డుకుంది.
Read Also: Donald Trump: టిక్‌టాక్‌పై మారిన ట్రంప్ స్వరం.. ఉద్దేశమేంటంటే..!
ఇటీవల బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) 13 వేల అడుగుల ఎత్తులో రూ. 825 కోట్లతో సేలా టన్నెల్‌ని నిర్మించింది. అస్సాంలోని తేజ్‌పూర్‌ని అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌ని కలిపే బలిపర-చర్దువార్-తవాంగ్ రహదారిపై సెలా పాస్ మీదుగా ఈ టన్నెల్ నిర్మించారు. ప్రస్తుతం ఈ టన్నెల్‌కి కేవలం 3 కి.మీ దూరంలోనే చైనా గ్రామం ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు తెలియజేస్తున్నాయి. దాదాపుగా 25-30 ఇళ్ల నిర్మాణాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి గ్రామాలను చైనా నిర్మించి, అందులో ప్రజలు ఉండేలా చేస్తోంది.
నివేదిక ప్రకరాం.. టిబెట్ అటానమస్ రీజియన్‌లో ఇలాంటివి 628 గ్రామాలనున చైనా ఏర్పాటు చేసింది. పౌర, సైనిక ప్రయోజనాల కోసం, ఎల్ఏసీ వెంబడి భూభాగాలను క్లెయిమ్ చేయడానికి చైనా ఈ గ్రామాలను నిర్మిస్తోంది. చైనాకు ధీటుగా భారత్ ‘వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ కింద 663 సరిహద్దు గ్రామాల్లో ఆధునిక సౌకర్యాల అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చైనా సరిహద్దులో ఉన్న 17 గ్రామాలను ఈ కార్యక్రమం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. మరోవైపు భారత్ ట్రాన్స్ అరుణాచల్ హైవే, ఫ్రాంటియర్ హైవే, ఈస్ట్-వెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ హైవేలను అభివృద్ధి చేస్తోంది. సరిహద్దు వెంబడి కమ్యూనికేషన్, రోడ్ నెట్వర్క్‌ని డెవలప్ చేస్తోంది.
అయితే, చైనా మాత్రం భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ప్రధాని మోడీ అరుణాచల్ పర్యటనను చైనా వ్యతిరేకిస్తోంది. సేలా టన్నెల్ ప్రారంభోత్సవం తర్వాత చైనా మాట్లాడుతూ.. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయని జాంగ్నాన్(అరుణాచల్‌ని చైనా ఇలాగే పిలుస్తుంది) చైనాలో అంతర్భాగమని పేర్కొంది. ఈ ప్రాంతాన్ని ఏకపక్షంగా అభివృద్ధి చేసే హక్కు భారత్‌కి లేదని ఆ దేశ విదేశాంగ ప్రతినిది వాంగ్ వెన్బిన్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని మనదేశం ప్రకటించింది.