NTV Telugu Site icon

Chandrayaan-3: భారత టెక్నాలజీని అమెరికా కోరింది.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు..

Somanath

Somanath

Chandrayaan-3: అగ్రరాజ్యాల స్పేస్ ఏజెన్సీలు అదిరిపోయేలా చంద్రయాన్-3 మిషన్‌ని విజయవంతం చేసింది ఇస్రో. అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. అమెరికా, రష్యా,చైనాల తర్వాత చంద్రుడిని చేరిని నాలుగో దేశంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే చంద్రయాన్-3 సమయంలో మన టెక్నాలజీని అమెరికా నాసా నిపుణలు కోరారని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా డా. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్ ప్రసంగించారు.

చంద్రయాన్-3 వ్యోమనౌక అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని నాసా- జెట్ ప్రొపెల్షన్ ల్యాబోరెటరీ నిపుణులు కోరారని సోమనాథ్ వెల్లడించారు. నాసా నుంచి చంద్రయాన్-3 పనుల్ని పరిశీలించేందుకు ఆరుగురు నిపుణులు వచ్చారని, వారికి మేము చంద్రయాన్-3ని ఎలా రూపొందించాము, చంద్రుడిపై ఎలా దిగబోతున్నాము అన్ని వివరాలను వివరించామని, వారి నుంచి ‘‘ నో కామెంట్స్.. అంతా బాగానే ఉంటుంది’’ అని అన్నారని ఇస్రో చీఫ్ వెల్లడించారు.

ఇస్రో, భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించిన శాస్త్రీయ పరికరాలు చాలా చౌకగా ఉండటంతో పాటు నిర్మించడం సులువు, అదే సమయంలో చాలా హై టెక్నాలజీతో రూపొందించారని, మీరు వీటిని ఎలా నిర్మించారని..? మీరు దీన్ని అమెరికాతో ఎందుకు పంచుకోకూడదని అడిగారని ఆయన చెప్పారు.

ప్రస్తుతం కాలం ఎలా మారిపోయిందో మీరు చూడవచ్చు.. మేము భారత దేశంలోని అత్యుత్తమ పరికరాలు, అత్యుత్తమ రాకెట్లను నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని, అందుకు మన ప్రధాని మోడీ అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు దారులు తెరిచారని చెప్పారు. చెన్నైలోని అగ్నికుల్, హైదరాబాద్ లోని స్కైరూట్ రాకెట్లను నిర్మిస్తోందని, భారతదేశంలోని 5 కంపెనీలు రాకెట్లు, శాటిలైట్లను తయారు చేస్తున్నాయని సోమనాథ్ అన్నారు.

కలలు కనడం అత్యంత శక్తివంతమైన సాధనం, రాత్రిపూట కాకుండా మెలుకువగా ఉన్నప్పుడు కలలు కనాలని అబ్దుల్ కలాం సార్ చెప్పారని, ఎవరికైనా కలులు ఉన్నాయా..? ఎవరైనా చంద్రుడిపైకి వెళ్లాలనుకుంటున్నారా..? పిల్లల్ని ప్రశ్నించారు. చంద్రయాన్-3 ని చంద్రుడిపై ల్యాండ్ చేసిన సమయంలో, ప్రధాని మోడీ మీరు భారతీయులను చంద్రుడిపైకి ఎప్పుడు పంపుతారని అడిగారని తెలిపారు. చంద్రయాన్ -10వ సమయంలో మీలో ఒకరు రాకెట్ లో భారతదేశం నుంచి చంద్రడిపైకి వెళ్తారని, అది ఒక మహిళ కూడా కావచ్చని అన్నారు.