NTV Telugu Site icon

Tailors: మహిళల కొలతలు మగవారు తీసుకోవద్దు.. మహిళా కమిషన్ ప్రతిపాదన!

Tailorsup

Tailorsup

దేశంలో రోజురోజుకు మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. నమ్మినవారే నట్టేట ముంచేస్తున్నారు. అన్ని చోట్ల మహిళలకు భద్రత లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో మహిళల సేఫ్టీ కోసం ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. పురుషుల ‘బ్యాడ్ టచ్’ నుంచి మహిళలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోకూడదని పేర్కొంది. అలాగే అమ్మాయిల శిరోజాలను కత్తిరించే పనులు కూడా చేయకూడదని ప్రతిపాదించింది. ఈ మేరకు మహిళా కమిషన్‌ సభ్యురాలు హిమానీ అగర్వాల్‌ వెల్లడించారు. ప్రస్తుతం తాము ప్రతిపాదనలు మాత్రమే చేశామని, త్వరలోనే వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు చట్టం తీసుకొచ్చేలా యూపీ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు 28న జరిగిన మహిళా కమిషన్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం హిమానీ అగర్వాల్ స్పష్టం చేశారు.

ప్రతిపాదనలు ఇవే..
అమ్మాయిల దుస్తుల కొలతలు మహిళలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపింది. సెలూన్‌లలో మహిళా కస్టమర్లకు అమ్మాయిలే సేవలందించాలని పేర్కొంది. జిమ్‌, యోగా సెంటర్లలో అమ్మాయిలకు మహిళా ట్రైనర్లే ఉండాలని… అలాంటి జిమ్‌లను తప్పనిసరిగా వెరిఫికేషన్‌ చేయాలని స్పష్టం చేసింది. స్కూల్‌ బస్సుల్లో తప్పనిసరిగా మహిళా ఆయా లేదా ఉపాధ్యాయిని ఉండాలని చెప్పింది. డ్రామా ఆర్ట్‌ సెంటర్లలో అమ్మాయిలకు మహిళా డ్యాన్స్‌ టీచర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. మహిళల వస్తువులను విక్రయించే దుకాణాల్లో కూడా తప్పనిసరిగా మహిళా సిబ్బందే ఉండాలని.. కోచింగ్ సెంటర్లలో వాష్‌రూమ్‌లు, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని మహిళా కమిషన్ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Music Directors: సినిమాను ముంచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్

Show comments