NTV Telugu Site icon

Mukhtar Ansari: ముఖ్తాన్ అన్సారీ మరణం.. భయంతో టొమాటోలు తింటున్న ఖైదీలు..

Mukthar Ansari

Mukthar Ansari

Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ ఇటీవల జైలులో గుండెపోటుతో మరణించారు. అయితే, ఇతని మరణంపై కుటుంబ సభ్యులతో పాటు ఆయన కుమారుడు అనుమానం వ్యక్తం చేశారు. జైలులో తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చారని ఆరోపించారు. మరణానికి ముందు 40 రోజుల వ్యవధిలో ముఖ్తార్‌కు రెండుసార్లు విషం ఎక్కించారని అతని సోదరుడు అఫ్జల్అన్సారీ ఆరోపించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అన్సారీ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉత్తర్ ప్రదేశ్ బండా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీపై విషప్రయోగం చేశారనే వాదనల నేపథ్యంలో ఖైదీలు భయపడుతున్నారు.

Read Also: CS Shanti Kumari: రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం..

చాలా మంది ఖైదీల్లో అన్సారీ మరణం భయంగా వేధిస్తోంది. విషప్రయోగం వార్తల వినిపిస్తున్న తరుణంలో ఖైదీలు ఆహారం తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. సీనియర్ ఖైదీలు పచ్చి టొమాటోలను ఉప్పుతో కలిపి తింటున్నారు. సాదా రోటీలతో కడుపు నింపుకుంటున్నారు. సాధారణ భోజనానికి దూరంగా ఉంటున్నారు. ఖైదీలు జరుగుతున్న విషయాలను టీవీలో చూడటం వల్ల ఇలాంటి పుకార్లు జైలులో వ్యాపిస్తున్నాయి.

మరోవైపు, ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ముఖ్తార్ అన్సారీ మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మార్చి 28న ముఖ్తార్ అన్సారీ మరణం జైలులోని ఖైదీల్లో భయాన్ని పెంచిందని జైలు అధికారులు చెబుతున్నారు. జైలు సూపరింటెండెంట్‌తో పాటు సీనియర్ డాక్టర్లు ఖైదీల్లో భయాన్ని పోగొట్టేందుకు వారితో మాట్లాడారు. ముఖ్తాన్ ఆరోగ్య హిస్టరీ గురించి, గతంలో రోపర్ జైలులో రెండుసార్లు గుండెపోటుకు గురైన విసయాన్ని తెలియజేశారు.