UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2027 నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార బీజేపీని ప్రభుత్వం నుంచి దించేందుకు రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నప్పటికీ, సీట్ల పంపకాల్లో మాత్రం విభేదాలు చాలా ఉన్నాయి. యూపీలో మొత్తం 403 సీట్లు ఉంటే, కాంగ్రెస్ తొలుత 181 సీట్లను కోరింది. సోమవారం తొలి విడత సీట్ల పంపకాల చర్చల్లో 130 సీట్లు కావాలని, సీట్ల జాబితాను ఎస్పీ నేతల ముందు ఉంచింది.
అయితే, ఎస్పీ మాత్రం కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లు ఇచ్చేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా గాంధీ కుటుంబానికి కుంచుకోటలుగా పరిగణించే అమేథీ, రాయ్‌బరేలీపై ఎస్పీ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. రాయ్‌బరేలీలో ఒక్క సీటు కూడా ఇచ్చేందుకు ఎస్పీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. అమేథీలో నాలుగు స్థానాల్లో కేవలం ఒక్క జగదీశ్‌పూర్ కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
కాంగ్రెస్‌కు 26 సీట్లు ఆఫర్.
ఎస్పీ కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లను మాత్రమే ఆఫర్ చేసింది. ఇందులో రాంపూర్ ఖాస్, ఫరెండా, మథుర, ఖేరాగఢ్, జగదీష్‌పూర్, కిద్వాయ్ నగర్, బాగ్‌పట్, మోదీనగర్, హాపూర్, జేవార్, సయానా, ఖుర్జా, ఖైర్, ఇగ్లాస్, మంత్, ఆగ్రా నార్త్, ఫతేపూర్, గోవింద్‌నగర్, నాన్పారా, గోరఖ్‌పూర్ సిటీ, ఖజ్నీ, పడ్రౌనా, ఫాజిల్‌నగర్, పింద్రా, వారణాసి కాంట్ తదితర నియోజకవర్గాలు ఉన్నాయి.
మంగళవారం సమన్వయ కమిటీ సమావేశానికి ముందు ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ ముందు ఉంచారు. ఈ 26
స్థానాల్లోనే కాంగ్రెస్ 2 స్థానాలను మాత్రమే గెలిచిందని, మరో 4 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిందని, మిగిలిన 20 స్థానాల్లో గత ఎన్నికల్లో ఎస్పీకి 60 వేల నుంచి 70 వేల వరకు ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. అయినప్పటికీ ఆ స్థానాలను కాంగ్రెస్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
130 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. పొత్తు చర్చలకు ముందు కాంగ్రెస్ ఈ సారి 200 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. చర్చల దగ్గరకు వచ్చేసరికి ఇది 130కి చేరింది. కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికల్ని ప్రాతిపదికగా తీసుకుని ఎక్కువ సీట్లు కోరుతోంది. ఎస్పీ మాత్రం 2022 అసెంబ్లీ ఎన్నికల ఫలితానున చూపిస్తూ 26 స్థానాలు మాత్రమే ఆఫర్ చేస్తోంది.

