NTV Telugu Site icon

UP BJP: యూపీ బీజేపీలో భారీ కదుపు.. రాజీనామాకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..

Bjp

Bjp

UP BJP: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘోర పరాజయం చూసింది. 2014, 2019 ఎన్నికల్లో దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన ఆ పార్టీ, 2024 ఎన్నికల్లో మాత్రం దారుణమైన ఫలితాలను చూసింది. అయోధ్య రామమందిరం నిర్మించిన ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోవడం ఒకింత ఆ పార్టీని తీవ్ర నిరాశలోకి తీసుకెళ్లింది. మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి 43 సీట్లను గెలుచుకోగా, బీజేపీ కూటమి కేవలం 36 చోట్ల మాత్రమే విజయం సాధించింది. 2019లో బీజేపీకి 62 సీట్లు ఉంటే బీజేపీ సొంతగా ఈ సారి 33 స్థానాలు కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే, మరోవైపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఖాళీలు ఏర్పడిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే యూపీ ఉప ఎన్నికలు పార్టీకి కీలకమయ్యాయి. దీనిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Read Also: Karnataka: కన్నడ మాట్లాడే వారికే కంపెనీల్లో ఉద్యోగాలు..!బెంగళూరులో ఐటీ కంపెనీల పరిస్థితేంటి?

ఈ క్రమంలోనే యూపీ బీజేపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలకు మధ్య విభేదాలు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నిన్న బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి భేటీ అయ్యారు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం యూపీ బీజేపీ యూనిట్‌ని పూర్తిగా ప్రక్షాళన చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల వైఫల్యానికి గానూ తాను రాజీనామా చేస్తానని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి, ప్రధాన నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ప్రతిపాదించారు. దీనిపై చర్చించేందుకు అమిత్ షా, ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల ఎదురుదెబ్బ నుండి తిరిగి పుంజుకోవడానికి మరియు 2027 రాష్ట్ర ఎన్నికలకు సిద్ధమవుతున్నందున, బిజెపి తన రాష్ట్ర చీఫ్‌గా ఒబిసి నాయకుడిని నియమించాలని అనుకుంటోంది. జాట్ వర్గంలో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు చౌదరికి 2022లో రాష్ట్ర చీఫ్‌గా నియమించారు. ప్రస్తుతం ఉప ఎన్నికల్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఓబీసీ నాయకుడికి రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.