NTV Telugu Site icon

West Bengal: బెంగాల్‌లో తీవ్ర హింస.. కేంద్రమంత్రి కాన్వాయ్‌పై దాడి..

Union Minister Nisith Pramanik

Union Minister Nisith Pramanik

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో తీవ్ర హింస చెలరేగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు హింసకు పాల్పడుతున్నాయని బీజేపీతో సహా ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అన్ని ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇదిలా ఉంటే శనివారం కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై దాడి జరిగింది. కూచ్ బెహార్ జిల్లాలోని సాహెబ్ గంజ్ బీడీఓ ఆఫీస్ వెలుపల కేంద్ర సహాయమంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై టీఎంసీ గుండాలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.

తనపై ఆయుధాలతో దాడి చేశారని, రాబోయే పంచాయతీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల పరిశీలన కోసం బీడీఓ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ప్రమాణిక్ తెలిపారు. టీఎంసీ గుండాలు పోలీసుల ముందే బీజేపీ అభ్యర్థుల పత్రాలను లాక్కుని కొట్టారని.. బీజేపీపై దాడులు చేసేలా పోలీసులు అనుమతి ఇస్తున్నారంటూ ప్రమాణిక్ ఆరోపించారు.

Read Also: NSA Ajit Doval: సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే భారతదేశం విడిపోయేది కాదు..

బీడీఓ కార్యాలయం లోపల బీజేపీకి చెందిన మహిళా కార్యకర్తలను టీఎంసీ గుండాలు వేధించారని కేంద్రమంత్రి ఆరోపించారు. టీఎంసీ గుండాల దాడిలో బీజేపీ అభ్యర్థులు తీవ్రంగా గాయపడ్డారన, ఆస్పత్రి పాలయ్యారని అన్నారు. నిసిత్ ప్రమాణిక్ పై దాడిని బీజేపీ ఖండించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. ఈ ఘటన సిగ్గుచేటని అన్నారు. కేంద్రమంత్రితో ఇలా ప్రవర్తిస్తుంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించండి అని అన్నారు. కేంద్రమంత్రి కారుపై బాంబులు విసిరారని.. టీఎంసీ మంత్రి ఉదయన్ గుహా తన గుండాలతో 1000 మందితో అక్కడ ఉన్నాడని ఆయన ఆరోపించారు. మమతా బెనర్జీ రాష్ట్రాన్ని నడుపుతున్నారా..? డ్రామాలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు.

బెంగాల్ లో జూలై 8న మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల తేదీ ప్రకటించిన వెంటనే బెంగాల్లో వివిధ ప్రాంతాల్లో అనేక ఘర్షణలు జరిగాయి. దాస్పూర్ (పశ్చిమ్ మేదినీపూర్), కక్‌ద్వీప్ (దక్షిణ 24 పరగణాలు), రాణినగర్ (ముర్షిదాబాద్), శక్తినగర్ మరియు బర్షుల్ (రెండూ పూర్బా బర్ధమాన్‌లో),మినాఖాన్ (నార్త్ 24 పరగణాలు) ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.