భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య ఇప్పటికే మూడు లక్షలు క్రాస్ చేయగా.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే ఇవాళ కాస్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. ఇక, ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి, ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.. అయితే, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటి కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి… కేసులు భారీగా నమోదు అవుతున్న సమయంలో.. మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ తప్పదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండగా.. వాటిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
కోవిడ్ పరిస్థితి, ఆక్సిజన్, బెడ్ల కొరత లాంటి అంశాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కిషన్‌రెడ్డి… దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. కానీ, పది రాష్ట్రాల కోసం కేంద్రం లాక్ డౌన్ పెట్టలేదు అని స్పష్టం చేశారు. ఇక, కేసుల తీవ్రతను బట్టి.. లాక్ డౌన్‌పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలదేన్న కేంద్ర మంత్రి.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీరుస్తున్నామని వెల్లడించారు. మరోవైపు.. కోవిడ్ సమయంలో.. తెలంగాణలో మరిన్ని పడకలు పెంచాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.. కేంద్రం పంపిన వెంటిలేటర్లు పుర్తిగా వాడటం లేదని విమర్శించిన ఆయన.. కరోనా కేసులు, మరణాలపై తెలంగాణ సర్కార్ వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.. రాష్ట్రాల్లో కేసులు, మరణాల లెక్కల ప్రకారమే కేంద్రం కేటాయింపులు ఉంటాయన్నారు కిషన్ రెడ్డి..