Union Budget 2026: దేశ రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం మూడు కీలక ప్రకటనలు చేస్తే, స్టాక్ మార్కెట్ రాకెట్ లా దూసుకుపోతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ డిమాండ్లకు జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా మద్దతు తెలపడం విశేషం.
డిమాండ్లు
1) LTCG పన్ను మినహాయింపు పరిమితి పెంపు
ప్రస్తుతం షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) పన్నులో ఏడాదికి రూ.1.25 లక్షల వరకు మినహాయింపు.. ఆ మొత్తాన్ని మించిన లాభాలపై 12.5 శాతం పన్ను అమలులో ఉంది. అయితే ఈ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని పెట్టుబడిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తే దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2) STCG పన్ను తగ్గింపు
స్వల్పకాలిక మూలధన లాభాల (STCG)పై ప్రస్తుతం 20 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. దీనిని 10 శాతాకి తగ్గించాలి.. అలాగే రూ.1.5 లక్షల వరకు లాభాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలి.. అని పెట్టుబడిదారుల డిమాండ్‌గా ఉంది… ఇది ట్రేడింగ్ కార్యకలాపాలను పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
3) STT రద్దు లేదా తగ్గింపు
షేర్ల కొనుగోలు, అమ్మకాలపై విధించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను పూర్తిగా రద్దు చేయాలని లేదా గణనీయంగా తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం.. ఈక్విటీ డెలివరీపై 0.1 శాతం.. డెరివేటివ్స్‌పై 0.01 శాతం, ఇంట్రాడే ట్రేడింగ్‌పై 0.025 శాతం STT వసూలు చేస్తున్నారు. ఇది చిన్న మొత్తంగా కనిపించినప్పటికీ, పెద్ద ట్రేడింగ్ వాల్యూమ్ ఉన్నవారికి భారీ భారం అవుతోందని నిపుణులు చెబుతున్నారు.
నితిన్ కామత్ కీలక వ్యాఖ్యలు
బడ్జెట్ 2026కు ముందు జెరోధా సీఈవో నితిన్ కామత్ STTపై ఆందోళన వ్యక్తం చేశారు. LTCG పన్ను లేని సమయంలో STTను అమలు చేశారు. ఇప్పుడు LTCG పన్ను తిరిగి వచ్చిన తర్వాత కూడా STTను పెంచుతూనే ఉన్నారు. దీని వల్ల పెట్టుబడిదారులపై ద్వంద్వ పన్ను భారం పడుతోంది.. అని ఆయన వ్యాఖ్యానించారు. STT పెరుగుదల మార్కెట్ కార్యకలాపాలపై, ప్రభుత్వ ఆదాయాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
LTCG, STCG అంటే ఏమిటి?
LTCG (Long Term Capital Gains): షేర్లను 12 నెలల తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలు.. STCG (Short Term Capital Gains): షేర్లను 12 నెలల లోపే విక్రయిస్తే వచ్చే లాభాలు.. అయితే, ఈ మూడు డిమాండ్లలో కనీసం కొన్నింటినైనా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటిస్తే, స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు ఇది పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.
