NTV Telugu Site icon

Amit Shah: వచ్చే టర్మ్‌లో యూసీసీ, జమిలి ఎన్నికలు అమలు..

Amit Shah

Amit Shah

Amit Shah: బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత వచ్చే 5 ఏళ్లలో దేశం మొత్తం యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని అమలులోకి తెస్తామని కేంద్ర హోమంత్రి అన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన సమయం ఆసన్నమైందని, మోడీ ప్రభుత్వం తరువాతి కాలంలో ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ అమలు చేస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన చెప్పారు. ఏకకాల ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయని అన్నారు.

Read Also: PM Modi: చిన్నప్పుడు కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను.. చాయ్‌తో ప్రత్యేక అనుబంధం..

యూసీసీ అనేది రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి మనకు, మన పార్లమెంట్‌కి, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు మిగిలి ఉన్న బాధ్యత అని షా చెప్పారు. ‘‘రాజ్యాంగ సభ మనకు నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలలో యూనిఫాం సివిల్ కోడ్ కూడా ఉంది. ఆ సమయంలో కేఎం మున్షీ, రాజేంద్ర బాబు, అంబేద్కర్ జీ వంటి న్యాయ పండితులు లౌకిక దేశంలో మతం ఆధారంగా చట్టాలు ఉండకూడదని చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ ఉండాలి’’ అని అన్నారు.

యూసీసీ 1950ల నుంచి బీజేపీ ఎజెండాలో ఉందని, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని బీజేపీ సర్కార్ యూసీసీని అమలు చేసిందని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ ఒక భారీ సామాజిక, చట్టపరమైన,మతపరమైన సంస్కరణ అని తాను నమ్ముతున్నట్లు షా చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేసిన చట్టం సామాజిక మరియు చట్టపరమైన పరిశీలనకు లోనైందని, మత పెద్దలను కూడా సంప్రదించారని ఆయన అన్నారు. వచ్చే 5 ఏళ్లలో యూసీసీ అమలవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏకకాల ఎన్నికల కోసం రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశామని, దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా అన్నారు.