Site icon NTV Telugu

Indian Army: ఉల్ఫా ఉగ్రవాదులపై ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’తో మాకు సంబంధం లేదు: భారత సైన్యం

Ulfa

Ulfa

Indian Army: భారతదేశానికి వ్యతిరేకంగా వేర్పాటువాద ఉద్యమం చేస్తున్న నిషేధిత “యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఇండిపెండెంట్)” లేదా “ఉల్ఫా” ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు జరిగాయి. మయన్మార్‌లోని సాగైయాంగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో కీలకమైన ఉల్ఫా ఉగ్రవాదులు మరణించారు. అయితే, ఈ దాడులను భారత సైన్యం జరిపిందని, ఆదివారం ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులతో తమకు సంబంధం లేదని భారత సైన్యం ఖండించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర పోలీసులు ఎలాంటి దాడిలో పాల్గొనలేదని స్పష్టం చేశారు.

Read Also: Diabetes Symptoms: షుగర్ వ్యాధి వచ్చిందని అనుమానమా..? అలా జరిగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..?

చర్చలకు వ్యతిరేకంగా ఉల్ఫాలోని ఒక వర్గం సాయుధపోరాటం ద్వారా అస్సాంను భారత్ నుంచి వేరు చేయాలని ఉద్యమిస్తోంది. ఇది భారత సరిహద్దుల్లోని మయన్మార్‌లో మొబైల్ శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ ఉగ్రసంస్థ చీఫ్‌ పరేష్ బారువా నేతృత్వంలో పనిచేస్తోంది. ఇతను మయన్మార్, చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంటాడనే సమాచారం ఉంది. మొత్తం 150 డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడంతో ముగ్గురు అగ్ర నాయకులు చనిపోయినట్లు ఉల్ఫా చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.

ఉల్ఫా లోయర్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన నయన్ అసోమ్ అలియాస్ నయన్ మేధీ డ్రోన్ దాడిలో మరణించాడు. దాదాపు 19 మంది గాయపడ్డారని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే, కొన్ని నివేదికల ప్రకారం, దాడిలో ఇజ్రాయిల్, ఫ్రెంచ్ డ్రోన్లను ఉపయోగించినట్లు తెలిపాయి. 2019లో భారతదేశం మయన్మార్‌తో కలిసి ఆపరేషన్ సన్‌రైజ్ అనే కోడ్‌నేమ్‌తో సరిహద్దుల్లో ఆపరేషన్ నిర్వహించాయి. ఆ సమయంలో ఉల్ఫా, నాగా ఉగ్రవాద సంస్థలైన NSCN ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు.

Exit mobile version