Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..

  • కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్.
  • ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ఆదేశాలు.
  • నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ.
Pune2

Pune2

Ketan Agarwal murder case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది, ముంబై దాడుల కేసులో ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష పడేలా వాదించిన ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధితు కుటుంబానికి ఈ హామీ ఇచ్చారు. శుక్రవారం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సీఎంను కలిసి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన ఉజ్వల్ నికమ్‌ను నియమించాలని కుటుంబం చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఈకేసు వాదించడానికి ఉజ్వల్ నికమ్ కూడా అంగీకరించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. దీంతో పాటు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయ, శాసన శాఖ కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, కేతన్‌ను లోహ్‌గఢ్ కోట పైనుంచి లోయలోకి తోసి చంపేశారు. ఈ ఘటనను ముందుగా ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, చివరకు కేతన్ కుటుంబ సభ్యుల అనుమానాలతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. జూన్ 14న లోహ్‌గఢ్ కోటకు తీసుకెళ్లి కేతన్‌ను చంపేందుకు విఫలయత్నం చేసింది. ప్లాన్ విఫలం కావడంతో జూన్ 18న మరోసారి అదే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు తేలింది.