Site icon NTV Telugu

Ujjain Case: రక్తంతో సాయం కోసం 8 కి.మీ నడక.. ఆటో డ్రైవర్, మరో ముగ్గురి అరెస్ట్..

Ujjain Case

Ujjain Case

Ujjain Case: ఉజ్జయిని అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. 15 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై సాయం కోసం బతిమిలాడితే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదు. చివరకు రూ.50, 100 ఇవ్వాలని ప్రయత్నించారే తప్పితే తీవ్రం బాధపడుతున్న బాలికను ఆస్పత్రిలో చేర్చాలని చూడలేదు. ఈ అత్యాచార ఘటనలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కళ్లకు కట్టినట్లు చూపించింది.

అర్థనగ్నంగా 8 కిలోమీటర్లు నడిచి ఇంటింటికి వెళ్లి వేడుకున్నా ఒక్కరూ కనికరించలేదు, ఓ నివాసం వద్దకు వెళ్లగా ఓ వ్యక్తి ఆమెను తరిమి కొట్టడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. చివరకు ఓ పూజారి బాలికకు కొత్త బట్టలు ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితిని చూసి కొందరు ఆర్థికంగా సాయం చేసేందుకు చూశారని ఉజ్జయిని ఎస్పీ సచిన్ శర్మ అన్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఒక ఆటో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ ని రాకెష్(38) గా గుర్తించారు. బాధిత బాలిక జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కిందని, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో లభించిందని పోలీసులు తెలిపారు. ఆటోపై రక్తపు మరకలు ఉండటంతో వాటి నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని పోలీసులు వెల్లడించారు.

Read Also: Chinese Hackers: అమెరికా ప్రభుత్వానికి చెందిన 60వేల ఈ మెయిల్స్ దొంగిలించిన చైనీస్ హ్యాకర్లు

ఈ సంఘటన వెలుగులోకి రావడానికి ఒక రోజు ముందు మైనర్ బాలిక తప్పిపోయినట్లు తెలిసిందని, బాలిక వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురిని కలుసుకుందని అందర్ని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ తో పాటు దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం రావడంతో మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు.

అయితే ఈ ఘటనలో బాలిక ప్రత్యేకంగా సాయం గురించి మాత్రమే అడగ లేదని, తనను ఎవరో వెంబడిస్తున్నారని చెప్పిందని పోలీసులు తెలిపారు. నేను ప్రమాదంలో ఉన్నాను, నా వెనక ఎవరో వస్తున్నారని బాలిక పదేపదే చెప్పినట్లు పలువురు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తీవ్రగాయాల పాలైన బాలిక పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉజ్జయినికి 700 కి.మీ దూరంలో ఉన్న మధ్యప్రదేశ్ లోని మరో జిల్లాలో ఆమె తాతా, అన్నయ్యతో కలిసి ఉంటున్నట్లు తెలసింది. ఆదివారం బయటకు వెళ్లిన బాలిక మళ్లీ ఇంటికి తిరిగి రాకపోవడంతో మిస్సింగ్ కంప్లైట్ నమోదైంది.

Exit mobile version