Maharashtra Politics: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాలాసాహెబ్ ఠాక్రేలకు సమాజంలో దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడిన వారసత్వం ఉందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బాలాసాహెబ్ థాకరే జయంతిని పురస్కరించుకుని శివసేన (యుబిటి), విబిఎ కూటమి మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పును తీసుకువస్తుందని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.
Read Also: Love marriage: ప్రేమ వివాహంలో కలతలు.. ముగ్గురు పిల్లలను కన్నతల్లి ఏంచేసిందంటే..
ఈ కలయిక రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందని.. కొన్ని పార్టీలు మిత్రపక్షాలను అంతం చేసేలా ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా బీజేపీని విమర్శించారు ప్రకాష్ అంబేద్కర్. రాజకీయ పార్టీల విజయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాకపోయినప్పటికీ.. శివసేన ఉద్ధవ్ వర్గం ముంబై ఎన్నికల్లో సత్తా చాలాటాని ప్రయత్నిస్తోంది. శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత ఉద్దవ్ వర్గం అధికారాన్ని కోల్పోయింది. ఆ తరువాత వస్తున్న పెద్ద ఎన్నికలు ఇవే కావడంతో గెలుపు కోసం పొత్తులను ఆశ్రయిస్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం ఈ పొత్తులో ఇద్దరం మాత్రమే ఉన్నామని..కాంగ్రెస్ పొత్తును అంగీకరించలేదని.. శరద్ పవార్ కూడా కూటమిలో చేరుతారని ఆశిస్తున్నట్లు ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.
గతేడాది శివసేనను చీల్చి ఏక్ నాథ్ షిండే, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడింది.