NTV Telugu Site icon

Uddhav Thackeray: రామమందిర సమయంలో “గోద్రా” తరహా ఘటన.. స్పందించిన బీజేపీ

Uddhav Thackeray

Uddhav Thackeray

Uddhav Thackeray: రామమందిర ప్రారంభోత్సవ సమయంలో ‘గోద్రా’ తరహా కుట్ర జరుగుతుందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు నెల రోజుల ముందు అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా లక్షల్లో హిందువలు హాజరయ్యే అవకాశం ఉంది. జల్గావ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. దేశంలోని నలుమూలల నుంచి బస్సులు, రైళ్లలో చాలా మంది హిందువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది, అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో గోద్రా తరహా సంఘటన జరగొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. బస్సులు తగలబెడతారు, రాళ్లు రువ్వుతారు, నరమేధం చేస్తారు, దేశం మళ్లీ మండిపోతుంది, ఈ మండలతో రాజకీయాలు చేస్తారంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ ఆరోపించారు.

Read Also: Crime News: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. పెట్రోల్‌ పోసుకుని ప్రియుడు సూసైడ్

ఠాక్రే వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. సీనియర్ బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దివంగత శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే రామమందిర ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు వింటే నా బిడ్డకు ఏమైందని బాలా సాహెబ్ అని బాధపడుతారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తుందని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమికి కొంత జ్ఞానం ఇవ్వాలని నేను రాముడిని ప్రార్థిస్తానని అన్నారు. ఠాక్రే వ్యాఖ్యలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా తప్పుబట్టారు. ఠాక్రే అత్యాశపరుడని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

2002లో గోద్రా అల్లర్లు మాయని మచ్చగా మిగిలాయి. సబర్మతి రైలులో కరసేవకులు ఉండగా, బోగీని తగలబెట్టారు. ఈ ఘటనలో 58 మంది చనిపోయారు. ఈ ఘటన ఆ తర్వాత గుజరాత్ అల్లర్లకు కారణమయ్యాయి. ఈ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఉన్నారు. అయోధ్య రామమందిరం సుప్రీంకోర్టు 2019లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. భవ్య రామమందిరాన్ని యూపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు జనవరి నెలలో ఈ ఆలయం ప్రారంభోత్సవం జరగనుంది.

Show comments