Site icon NTV Telugu

Udaipur Incident: ఉదయ్ పూర్ హత్యను ఖండిస్తున్న ముస్లిం సంస్థలు

Udaipur Assassination

Udaipur Assassination

ఉదయ్ పూర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాజస్థాన్ లో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది. ఇటీవల నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు మద్దతు ఇస్తూ పోస్ట్ చేసిన కన్హయ్య లాల్ అనే వ్యక్తిని ఇద్దరు మతోన్మాదులు రియాజ్ అక్తర్, గౌస్ మహ్మద్  అత్యంత పాశవికంగా తలను కోస్తూ చంపేశారు. చంపడమే కాకుండా ఈ సంఘటనలను వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

తాజాగా ఈ ఘటనపై పలు ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్’’ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని, ఇది ఇస్లాంకు విరుద్ధమని లాబోర్డ్ ప్రధాన కార్యదర్శి హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ అన్నారు. ఏ మతానికి సంబంధించిన వారైనా మతపరమైన వ్యక్తులను కించపరచడం ఘోరమైన నేరం అని.. నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల ముస్లిం సమాజాన్ని బాధించాయని అయితే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం మంచి పద్దతి కాదని ఆయన అన్నారు. ఒకరిని నేరస్తుడిగా భావించి హత్య చేయడాన్ని ఇస్లాం ఖండిస్తుందని ఆయన అన్నారు.  ఇదిలా ఉంటే ‘జమియత్ ఉలమా-ఇ-హింద్’ సంస్థ కూడా ఈ చర్యను ఖండించింది. దేశంలో చట్టాలు ఉన్నాయని.. వీటిని చేతిలోకి తీసుకోవద్దని సూచించింది.

ఉదయ్ పూర్ టైలర్ హత్యపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వ్యక్తిని  చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. దేశంలో రాడికలైజేషన్ వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. నుపుర్ శర్మను సస్పెండ్ చేస్తే సరిపోదని.. అరెస్ట్ చేయాలని అసద్ డిమాండ్ చేశారు.

 

 

Exit mobile version