NTV Telugu Site icon

Bear Grylls: “బేర్ గ్రిల్స్” వీడియోలు రక్షించాయి.. అగ్నిపర్వతం నుంచి బయటపడిన సోదరులు..

Bear Grylls

Bear Grylls

Bear Grylls: ‘బేర్ గ్రిల్స్’ ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మ్యాన్ వర్సెస్ వైల్డ్ వంటి షోలతో కష్టతరమైన పరిస్థితుల్లో ఎలా మనుగడ సాధించాలో చెప్పే ఈ షో ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. అయితే, ఇప్పుడు బేర్ గ్రిల్స్ షోలు చూసే ఇద్దరు ప్రమాదకరమైన అగ్నిపర్వతం బారి నుంచి తమను తాము రక్షించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన ఇండోనేషియాలోని బాలిలోని మౌంట్ అగుంగ్ అగ్నిపర్వతం వద్దకు వెళ్లి తప్పిపోయిన ఇద్దరు యువకుల విషయంలో జరిగింది.

ఇండోనేషియా బాలిలో ఒక అగ్నిపర్వతాన్ని అధిరోహించే క్రమంలో ఇద్దరు బ్రిటిష్ యువకులు అదృశ్యమయ్యారు. వారిని రక్షంచడానికి రెస్క్యూ బృందానికి 40 గంటల సమయం పట్టింది. బ్రిటిష్ జర్నలిస్టు కేథరీన్ ఫోర్‌స్టర్, తన ఇద్దరు కుమారులైన మాథన్(21), ఆండ్రూ(18) అనుభవాలను సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. తాను 30 గంటల పాటు తన కుమారుల మాట వినలేదని చెప్పారు.

Read Also: Accident: గుజరాత్‌లో ఘోర ప్రమాదం..లోయలో పడిన 70మంది ప్రయాణికులతో కూడిన బస్సు..

మాథన్, ఆండ్రూలు బాలిలోని 10,000 అడుగులు ఎత్తైన అగ్నిపర్వతాన్ని అధిరోహించాలని అనుకున్నారు. అక్కడ నుంచి సూర్యోదయాన్ని చూడాలని బయలుదేరారు. ఆగ్నేయాసియా అంతటా ప్రయాణించిన వీరిద్దరు, ఇంటికి వెళ్లే ముందు ఈ అగ్నిపర్వతం ఎక్కాలని భావించి, చివరకు ప్రమాదం అంచుల వరకు వెళ్లివచ్చారు.

అగ్నిపర్వతం ఎక్కే సమయంలో ఇద్దరి ఫోన్ల బ్యాటరీలు డెడ్ అయ్యాయి. దీంతో వీరు సాయం కోసం ఎవరిని కాంటాక్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే, బేర్ గ్రిల్స్ వీడియోలను చూసే అలవాటు ఉన్న వీరు, అందులో అతను ఉపయోగించిన మనుగడ టెక్నిక్స్‌ని వాడుకుని తమను తాము రక్షించుకోవాలని భావించారు. దీంతో వర్షపు నీటిని సేకరించడంతో పాటు, ఎలా ఆశ్రయం నిర్మించుకోవాలనే దానిని నేర్చుకున్నారు. వీరిద్దరు మిస్సైన విషయాన్ని మరో స్నేహితుడు బ్రిటిష్ ఎంబసీకి నివేదించడంతో రెస్క్యూ కార్యక్రమాలను ప్రారంభించారు. చివరిసారిగా వారి లోకేషన్‌ని ట్రేస్ చేశారు. దాదాపుగా 40 గంటల తనకవాత వీరిద్దర్ని సజీవంగా అధికారులు రక్షించారు.