తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. మొదటి నుంచి ఈ కేసుపై అనేక అనుమానాలు ఉన్నాయి. భర్త, అత్త చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తూ వచ్చింది. అంతేకాకుండా మొదటి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై కూడా సందేహాలు ఉండడంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో పంచనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక న్యాయస్థానం ఆదేశాలతో రెండో పాస్ట్‌మార్టం కూడా జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 24 రోజులైంది. కానీ ఇప్పటి వరకు రిపోర్ట్ బయటకు రాలేదు. దీంతో అనేక సందేహాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కానీ రెండో పోస్ట్‌మార్టం రిపోర్ట్ మాత్రం ఇంకా అందలేదు. అయితే మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నివేదిక ఆలస్యం అవుతోందని సంకేతాలు వస్తున్నాయి. అయితే జూన్ 16న జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ బృందం ఈ సమాచారాన్ని భోపాల్ కోర్టుకు అందించింది . రెండవ పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే ట్విషా మరణానికి స్పష్టమైన కారణం వెల్లడవుతుంది. ఆ దిశగా సీబీఐ తన దర్యాప్తును కొనసాగిస్తుంది. అయితే 24 రోజులు గడిచినా సీబీఐకి పోస్ట్‌మార్టం నివేదిక ఎందుకు అందలేదు అనేదే అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
వాస్తవానికి ట్విషా శర్మ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2026 మే 24న రెండవ పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం భోపాల్‌లోని ఎయిమ్స్‌లో ఈ పోస్ట్‌మార్టం పరీక్షను పూర్తి చేసింది. రెండవ పోస్ట్‌మార్టం జరిగి 24 రోజులు గడిచినా.. ఇప్పటి వరకు నివేదిక ఇంకా అందలేదు.
ఢిల్లీ ఎయిమ్స్‌లోని వైద్యుని ప్రకారం.. ట్విషా రెండవ పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న బృందం ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఇంకా ఒకటి రెండు పరీక్షలు చేయాల్సి ఉంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. పోస్ట్‌మార్టం నివేదిక రావడంలో ఆలస్యానికి ఇదే కారణం. అన్ని పరీక్షలు పూర్తయిన వెంటనే నివేదికను సీబీఐ బృందానికి అందజేస్తారని సమాచారం. భోపాల్‌లోని ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన ట్విషా శర్మ మొదటి పోస్ట్‌మార్టం పరీక్షలో ఆమె ఉరి వేసుకోవడం వల్ల మరణించినట్లు నిర్ధారించారు. ట్విషా శరీరంపై గాయాలు ఉన్నట్లు కూడా ఆ నివేదికలో వెల్లడి కావడంతో ఈ కేసు మరింత అనుమానాస్పదంగా మారింది.
నోయిడా నివాసి అయిన ట్విషా శర్మకు 2025 డిసెంబర్‌లో భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగింది. మే 12న కటారా హిల్స్‌లోని తన ఇంట్లో ట్విషా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె మరణానికి సంబంధించి ఆమె భర్త సమర్థ్, అత్తగారు, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ జైలులో ఉన్నారు. రెండో రిపోర్ట్ బయటకు వస్తేనే అనుమానాలు నివృత్తి అవుతాయి. లేదంటే సస్పెన్ష్ ఇలానే కొనసాగుతుంది.

