Twisha Sharmas: ట్విషా శర్మ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. మృతికి ముందు రూ.20 లక్షల షేర్లపై షాకింగ్ న్యూస్

  • ట్విషా శర్మ కేసులో మరో బిగ్ ట్విస్ట్
  • మృతికి ముందు రూ.20 లక్షల షేర్లపై షాకింగ్ న్యూస్
  • నిందితుల నుంచి మరింత సమాచారాన్ని రాబట్టనున్న సీబీఐ
Twisha Sharma

Twisha Sharma

తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఆమె మరణం దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని షాకింగ్ విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. ఈనెల 12న అత్త గారు గిరిబాలా సింగ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. అయితే అత్తింటి వారే తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇక తొలుత భోపాల్ ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన పోస్ట్‌మార్టం ప్రకారం ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. అయితే ఈ పోస్ట్‌మార్టంపై బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో న్యాయస్థానం ద్వారా తిరిగి ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందంతో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందే ట్విషా శర్మపై గాయాలు అయినట్లుగా తేలింది. ఆమె తీవ్రంగా పెనుగులాడినట్లుగా నివేదిక వచ్చింది. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తు మరింత సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

×
×
Ad

ఇక తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ట్విషా శర్మ మరణానికి ముందు రూ.20 లక్షల షేర్లు భర్త సమర్థ్‌సింగ్, అత్త గిరిబాలా సింగ్ బదిలీ చేయించుకున్నట్లుగా దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. అంతేకుండా గర్భం తన కొడుకు వల్ల రాలేదని.. దాన్ని తొలగించుకోవాలని గిరిబాలాసింగ్ ఒత్తిడి చేసినట్లుగా గుర్తించారు. ఈ విషయంలో తీవ్ర ఘర్షణ జరగడంతోనే ట్విషా శర్మకు గాయాలైనట్లుగా సీబీఐ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే భర్త సమర్థ్‌సింగ్ అదుపులో ఉండగా.. గురువారం అత్త గిరిబాలాసింగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఇద్దరిని కూర్చోబెట్టి ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా పూర్తి ఆధారాలతో విచారించేందుకు సిద్ధపడుతున్నారు.

నోయిడాకు చెందిన ట్విషా శర్మకు.. భోపాల్‌కు చెందిన క్రిమినల్ లాయర్ సమర్థ్‌సింగ్‌కు నాలుగు నెలల క్రితం వివాహం అయింది. పెళ్లైన దగ్గర నుంచి కూడా కాపురంలో కలహాలు జరుగుతున్నట్లుగానే సీబీఐ అధికారులు ట్విషా శర్మ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణను బట్టి గుర్తించారు. వివాహ సమయంలో వచ్చిన కానుకలు, కట్నాలు తమ స్థాయికి తక్కువగా ఉన్నాయని అత్తింటి వారు పదేపదే చెప్పారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక వియత్నాం పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ట్విషాను గేలి చేశారని, అలాగే ఆమె వివిధ కంపెనీల్లో వాటాలు కలిగి ఉందని వెలుగులోకి వచ్చినప్పుడు ఉద్రిక్తతలు మరింత పెరిగాయని వచ్చిన ఆరోపణలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు.

దర్యాప్తుకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం.. ట్విషా దాదాపు రూ. 20 లక్షల విలువైన షేర్లను కలిగి ఉంది. సమర్థ్ సింగ్, గిరిబాల సింగ్ ఇద్దరూ ఆ షేర్లను తమ పేర్ల మీదకు బదిలీ చేయించుకోవాలని కోరుకున్నారని ఆమె కుటుంబం ఆరోపించింది. ఆ కుటుంబంలోని అంతర్గత కలహాల పరంపరలో భాగంగానే ఈ ఆర్థిక ఆస్తులకు సంబంధించిన వివాదాలు తలెత్తాయా అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు.

ఇక ట్విషా గర్భానికి సంబంధించిన ఆరోపణలతో కలిపి చూసినప్పుడు ఈ అభియోగాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఆమె కుటుంబ సభ్యులు సమర్పించిన నివేదికల ప్రకారం.. బిడ్డ తండ్రి ఎవరనే దానిపై సందేహాలు తలెత్తిన తర్వాత.. గర్భాన్ని తొలగించుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. గర్భాన్ని తొలగిస్తేనే ఆమెను ఇంట్లోకి అంగీకరిస్తామని చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. వైద్య రికార్డులు, సందేశాలు మరియు సాక్షుల వాంగ్మూలాల ద్వారా ఈ ఆరోపణలను ధృవీకరించవచ్చా లేదా అని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇక ఆత్మహత్య తర్వాత ఎంపిక చేసిన సీసీటీవీ క్లిప్‌లు మాత్రమే ఎందుకు బహిరంగంగా వెలుగులోకి వచ్చాయో దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ట్విషా జిమ్ ప్రాంతంలోకి ప్రవేశించడం, కిందకు తీసుకురావడం చూపిస్తున్న ఫుటేజ్‌ను ప్రచారం చేయగా.. ఇతర కీలకమైన భాగాలు ఎందుకు అందుబాటులో లేవు? సాక్ష్యాలను ఎంపిక చేసి భద్రపరిచారా, లేక ముఖ్యమైన రికార్డులను మార్చారా? ఒకవేళ ట్విషా టెర్రస్‌పై ఉరి వేసుకుని కనపడితే.. ఆమె మృతదేహాన్ని కిందికి తీసుకురావాలని ఎవరు నిర్ణయించారు? అధికారులకు సమాచారం అందించక ముందే సీపీఆర్ ఎందుకు చేశారు? మృతదేహాన్ని తరలించడం అత్యవసర చర్యగా సమర్థనీయమేనా, లేక అది నేరం జరగబోయే ప్రదేశాన్ని మార్చివేసిందా? ఈ చర్యలు సాక్ష్యాల విశ్వసనీయతను ప్రభావితం చేశాయా లేదా అని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారిక రికార్డుల్లో ఉన్నట్లు ఆరోపించబడుతున్న వ్యత్యాసాలను కూడా సీబీఐ పరిశీలిస్తోంది. పోలీసు పత్రాల్లో ట్విషా ఎత్తును నమోదు చేయడం పరిశీలనలో ఉన్న ఒక అంశం. ఇది గుమస్తా పొరపాటా.. లేదంటే దర్యాప్తు నిర్లక్ష్యమా? లేక ఆమె మరణం చుట్టూ అల్లిన కథనాన్ని ప్రభావితం చేసే విస్తృత ప్రయత్నంలో భాగమా అని దర్యాప్తు అధికారులు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం దర్యాప్తు అధికారులు ఇకపై కేవలం ట్విషా ఎలా చనిపోయిందనే దానిపైనే దృష్టి పెట్టడం లేదు. ఆమె మరణానికి సంబంధించిన నిజాన్ని ఆ తర్వాత మార్చారా, దాచిపెట్టారా లేదా తారుమారు చేశారా అనే విషయాన్ని కూడా వారు నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.